భూసర్వే పనులపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:19 AM
Resolve pending applications quickly రెవెన్యూ సమస్యల పరిష్కారం, సమగ్ర భూసర్వే పనులు వేగవంతంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించండి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యల పరిష్కారం, సమగ్ర భూసర్వే పనులు వేగవంతంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కువగా ఉన్న రెవెన్యూ అంశాలపై, ముఖ్యంగా సమగ్ర భూసర్వే, జనాభాగణన పనులను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 22(ఏ) నిషేధిత భూముల జాబితా సవరణ కేసులను నిశితంగా పరిశీలించారు. ల్యాండ్ పీఎం నంబర్ల తప్పుడు నమోదు, వెబ్‌ల్యాండ్ వ్యత్యాసాల వలన పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. రీసర్వే మూడవ విడత, నాలుగవ విడత పనుల పురోగతితో పాటు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ భూములకు సంబంధించి, మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేసి ప్రత్యేక ఖాతానెంబర్లు కేటాయించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, మంచినీరు, వీధి దీపాల నిర్వహణపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంచేలా క్షేత్రస్థాయిలో యంత్రాంగం పనిచేయాలన్నారు. తాగునీటి సరఫరాలో జలుమూరు వెనకబడి ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అన్నక్యాంటీన్ల నిర్వహణ, పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మునిసిపల్ కమిషనర్లకు సూచించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు.