Share News

కిడ్నీ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - May 20 , 2026 | 12:15 AM

Inspection in Uddanam soon జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుతో ఎయిమ్స్‌ డైరెక్టర్‌, నీతి అయోగ్‌ సభ్యులు డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

కిడ్నీ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో మాట్లాడుతున్న ఎయిమ్స్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌

కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుతో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ భేటీ

త్వరలోనే ఉద్దానంలో క్షేత్రస్థాయి పరిశీలన

శ్రీకాకుళం, మే 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుతో ఎయిమ్స్‌ డైరెక్టర్‌, నీతి అయోగ్‌ సభ్యులు డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లాలోని ప్రజారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఉద్దానంలో కిడ్నీవ్యాధుల తీవ్రతకు కారణాలపై చర్చించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన నూతన వైద్య విధానాలు, శాశ్వత పరిష్కార మార్గాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఉద్దానం కిడ్నీ బాధితుల పట్ల తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను, తోడ్పాటును ఎయిమ్స్‌ డైరెక్టర్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు వివరించారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ అండ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇటీవల అందుబాటులోకి తెచ్చిన అధునాతన వైద్య సేవలు, డయాలిసిస్‌ సదుపాయాల ప్రస్తుత స్థితిగతులను క్షుణ్నంగా తెలియజేశారు. కిడ్నీ బాధితులకు మరింత మెరుగైన, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్‌ సంస్థ కలిసి పనిచేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఉద్దానంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు, బాధితులకు మరింత భరోసా కల్పించేందుకు త్వరలోనే జిల్లాలో పర్యటించాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ను కేంద్రమంత్రి కోరారు. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి, వైద్యపరంగా మరిన్ని కీలక సూచనలు, సలహాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 20 , 2026 | 12:15 AM