Share News

పది రోజుల్లో కుమారుడి వివాహం

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:34 AM

ఒక్కగానొక్క కుమారుడి వివాహం మరో పది రోజుల్లో జరగనుంది.. ఈ నేపథ్యంలో శుభలేఖలు బంధువులకు పంచేం దుకు వెళుతున్న తల్లి ప్రమాదానికి గురై మృత్యువాత పడింది.

పది రోజుల్లో కుమారుడి వివాహం

  • శుభలేఖలు ఇచ్చేందుకు వెళ్లి వస్తూ..

  • రోడ్డు ప్రమాదంలో ఆశా కార్యకర్త మృతి

కంచిలి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): ఒక్కగానొక్క కుమారుడి వివాహం మరో పది రోజుల్లో జరగనుంది.. ఈ నేపథ్యంలో శుభలేఖలు బంధువులకు పంచేం దుకు వెళుతున్న తల్లి ప్రమాదానికి గురై మృత్యువాత పడింది. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అరవ సరియాపల్లి (ప్రస్తుతం మఠం సరియాపల్లిలో ఉంది) గ్రామానికి చెందిన బుడ్డేపు కమలకుమారి (50) ఆశా కార్యకర్తగా పనిచేస్తోంది. భర్త చంద్రశేఖర్‌ సాధారణ రైతు. వీరికి కుమారుడు దినేష్‌ రెడ్డి, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడికి ఈనెల 12న వివాహం జరగనుంది. ఈ క్రమంలో కుమారుడి పెళ్లి శుభలేఖలు జాడుపూడి గ్రామంలోని బంధువులకు ఇచ్చేందుకు వెళ్లిన కమల కుమారి సాయంత్రం తిరిగి జాడుపూడి వద్ద బస్సు ఎక్కి అంపురం జంక్షన్‌ వద్ద దిగింది. స్వగ్రామానికి వెళ్లేందుకు నడుచుకుంటూ హైవే దాటుతుండగా పలాస వైపు నుంచి ఇచ్ఛాపురం వైపు వెళుతున్న కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కమలకుమారి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు. కాగా పది రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంటిల్లో కమల కుమారి మృతితో విషాదఛాయలు అలముకున్నాయి. ఆశా కార్యకర్తగా పని చేస్తున్న కమలకుమారి తన సేవలతో అందరికి ఆప్తురాలైంది. ఆమె అకాల మరణం దృరదృష్టకరమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 12:34 AM