Share News

కొడుకా.. ఏం కష్టమొచ్చింది?

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:09 AM

Electricity department employee commits suicide కొన్నాళ్ల కిందట భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడ్ని కష్టపడి చదివించి.. ప్రయోజకుడ్ని చేసింది. కాగా.. ఆ కుమారుడు పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కన్నతల్లి తల్లడిల్లిపోతోంది. ‘చనిపోయేంత కష్టం ఏమొచ్చింది కొడుకా.. ఇక నాకు దిక్కెవరూ’ అంటూ రోదించింది.

కొడుకా.. ఏం కష్టమొచ్చింది?
సంతోష్‌(ఫైల్‌), రోదిస్తున్న తల్లి మణి, బంధువులు.

కార్యాలయంలోనే విద్యుత్‌ ఉద్యోగి ఆత్మహత్య

బోరున విలపించిన తల్లి, బంధువులు

పలాస, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): కొన్నాళ్ల కిందట భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడ్ని కష్టపడి చదివించి.. ప్రయోజకుడ్ని చేసింది. కాగా.. ఆ కుమారుడు పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కన్నతల్లి తల్లడిల్లిపోతోంది. ‘చనిపోయేంత కష్టం ఏమొచ్చింది కొడుకా.. ఇక నాకు దిక్కెవరూ’ అంటూ రోదించింది. వివరాల్లోకి వెళితే.. పలాసలోని విద్యుత్‌ సబ్‌డివిజన్‌ కార్యాలయంలో డేటాఎంట్రీ ఆపరేటర్‌ కంచి సంతోష్‌కుమార్‌(31) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన శ్రీకాకుళంలో తల్లి మణితో కలిసి నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చి.. రెండో అంతస్తుపై ఉన్న సోలార్‌ విద్యుత్‌ ప్యానెల్స్‌ వైర్లను మెడకు బిగించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సిబ్బంది గమనించి.. ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసి తల్లి మణి బోరున విలపించింది. శ్రీకాకుళంలో ఉదయం 8 గంటలకు హుషారుగా బయటకు వెళ్లాడని.. కొద్దిగంటల్లోనే ఫోన్‌లో మరణ వార్త వినాల్చి వచ్చిందని కన్నీటిపర్యంతమైంది. ‘చిన్నప్పుడే తండ్రి మృతి చెందగా.. కుమారుడ్ని కష్టపడి పెంచాను. త్వరలో పెళ్లి కూడా చేయాలనుకున్నాను. ఇంతలో ఏమి కష్టమొచ్చిందో.. నాకు తోడుగా.. బాగోగులు చూసుకునే కొడుకు ఇక లేడు. నాకు దిక్కెవరు దేవుడా’ అని రోదించింది. బంధువులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.

అనుమానాలెన్నో

పనిచేస్తున్న కార్యాలయంలోనే.. సంతోష్‌ కుమార్‌ మృతి ఘటన చోటుచేసుకోవడంపై స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోలార్‌ప్యానెల్స్‌కు ఉన్న విద్యుత్‌వైర్లు నాలుగు అడుగుల ఎత్తులో ఉన్నా.. వాటితో ఏ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై విద్యుత్‌ ఉద్యోగులు కూడా తలో సమాధానం చెప్పడం చర్చనీయాంశమైంది. తొలుత విద్యుదాఘాతంతో మృతి చెందాడని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత అచేతనంగా పడిఉన్న ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసిందన్నారు. దీనిపై ఎస్‌ఐ జి.దుర్గాప్రసాద్‌ పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. సంతోష్‌ మృతికి కారణం ప్రేమ వ్యవహారమా.. లేదా వేధింపులా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - Sep 01 , 2026 | 12:09 AM