తప్పొకరిది.. శిక్షొకరికి!
ABN , Publish Date - May 07 , 2026 | 12:19 AM
విద్యుత్ శాఖ చేసిన తప్పు స్మార్ట్ మీటర్ల వినియోగదారుల పాలిట శాపంగా మారింది.
- విద్యుత్ శాఖ అనాలోచిత నిర్ణయం
- స్మార్ట్ మీటర్ల వినియోగదారుల అవస్థలు
- భారంగా మారిన ఏసీడీ చార్జీలు
- వందల సంఖ్యలో నిలిచిన విద్యుత్ సరఫరా
టెక్కలి, మే 6 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ శాఖ చేసిన తప్పు స్మార్ట్ మీటర్ల వినియోగదారుల పాలిట శాపంగా మారింది. ఏఈ అనాలోచిత నిర్ణయం కారణంగా డివిజన్ కేంద్రమైన టెక్కలిలో కేటగిరీ-2 కింద స్మార్ట్‌మీటర్లు పొందిన వందలమంది విద్యుత్ వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో ఉన్న కమర్షియల్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది. స్మార్ట్‌మీటర్లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంబంధిత ఏఈకి అప్పగించింది. అయితే, టెక్కలి మేజర్ పంచాయతీలో కొందరు స్మార్ట్‌మీటర్ల వినియోగదారులు బిల్లుల చెల్లింపులో జాప్యం చేశారు. దీంతో ఏఈ తన వద్దనున్న యాప్‌లో డిస్కనక్షన్ కొట్టడంతో ఒక్కసారిగా సంబంధిత స్మార్ట్‌మీటర్ల సేవలు నిలిచిపోయాయి. మళ్లీ ఆ సేవలు పొందాలంటే ముందుగా రీ-కనెక్షన్ ఆర్డర్ కోసం మీటరుదారుడు వంద రూపాయల అపరాధ రుసుం చెల్లించాలి. ఈ అపరాధ రుసుం వారిపాలిట భారంగా మిగిలింది. పైగా అడిషినల్ కన్వర్ట్ డిపోజిట్ కట్టాలని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతుండడంతో పుండు మీద కారం చల్లినట్లయ్యింది. వాస్తవానికి ప్రతినెల 15 నాటికి విద్యుత్ బిల్లు చెల్లించేందుకు అవకాశం ఉన్నప్పటికీ, ఏఈ అనాలోచిత నిర్ణయం మూలంగా 6వ తేదీ లోపే బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఆ తేదీ దాటితే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి అడిషినల్ కన్వర్ట్ డిపోజిట్ కట్టించాలంటే ముందుగా నోటీసు ఇవ్వాలి. ఇక్కడ విద్యుత్‌శాఖ ఏఈ అవేమీ చేయకుండానే తన వద్దనున్న స్మార్ట్‌మీటర్ యాప్‌లో డిలీషన్ కొట్టేశారు. దీంతో స్మార్ట్‌మీటర్ల వినియోగదారుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ఈ విషయమై విద్యుత్‌శాఖ ఏఈ మురళీమోహన్‌ను వివరణ కోరగా.. ‘టెక్కలి పట్టణంలో కేటగిరీ-2 కింద వెయ్యికి పైగా స్మార్ట్‌మీటర్లను అమర్చాం. అందులో 180 మీటర్లకు ఈ సమస్య గుర్తించాం. అడిషినల్ కన్వర్షన్ డిపాజిట్‌ను వినియోగదారుడు సుమారు వెయ్యి రూపాయలు కట్టాలి. వారికి వడ్డీతో ఏడాదికి ఒకసారి చెల్లిస్తాం. స్మార్ట్‌మీటరు వినియోగదారుడు నెలరోజుల బిల్లు చెల్లించకుండా డిఫాల్టర్‌గా ఉంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం.’ అని తెలిపారు.