Share News

అంతటా సోలార్‌

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:16 AM

Interest in solar power in the district జిల్లాలో సోలార్‌ విద్యుత్‌పై ఆసక్తి పెరుగుతోంది. సూర్యాఘర్‌ పథకంలో భాగంగా ప్రభుత్వం రాయితీ కల్పిస్తుండడంతో ఎక్కువ మంది సోలార్‌ విద్యుత్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తమ ఇళ్లపై సోలార్‌ పలకలు ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు.

అంతటా సోలార్‌
ఇచ్ఛాపురంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిపై ఏర్పాటు చేసిన సోలార్‌ యూనిట్‌..

  • జిల్లాలో సౌరవిద్యుత్‌పై ఆసక్తి

  • సూర్యాఘర్‌కు పెరుగుతున్న ఆదరణ

  • ఇచ్ఛాపురం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోలార్‌ విద్యుత్‌పై ఆసక్తి పెరుగుతోంది. సూర్యాఘర్‌ పథకంలో భాగంగా ప్రభుత్వం రాయితీ కల్పిస్తుండడంతో ఎక్కువ మంది సోలార్‌ విద్యుత్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తమ ఇళ్లపై సోలార్‌ పలకలు ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ 9,820 సోలార్‌ విద్యుత్‌ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నారు. మరో 12వేల వరకూ దరఖాస్తులు వచ్చాయి. వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టాయి. ప్రజలకు విద్యుత్‌ భారం నుంచి తప్పించేందుకు సూర్యఘర్‌ పథకంలో భాగంగా సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చాయి. వినియోగదారులు తమకు నచ్చిన కంపెనీకి చెందిన సోలార్‌ పలకలు ఎంపిక చేసుకోవచ్చు. అందుకు బ్యాంకులు సున్నా పెట్టుబడితో రుణాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఏర్పాటు చేసిన సోలార్‌ యూనిట్ల ద్వారా 30 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది.

  • ఎంతో ప్రయోజనం..

  • సోలార్‌ ప్రాజెక్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. విద్యుత్‌ బిల్లు ఆదా అవుతుంది. విద్యుత్‌ కోతల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఇంటి అవసరాలకు వినియోగించుకోగా.. మిగులు విద్యుత్‌ను డిస్కంలే కొనుగోలు చేయనున్నాయి. ఒకసారి సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాలపాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. ఒక కిలోవాట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు దాదాపు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకూ ఖర్చవుతుంది. దీనికి రూ.30 వేలవరకూ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రెండు కిలోవాట్ల ప్లాంట్‌ అయితే రూ.లక్ష నుంచి రూ.1.45 లక్షల ఖర్చు అవుతుంది. రూ.60 వేలు వరకూ సబ్సిడీ అందిస్తారు. మూడు కిలోవాట్లు అయితే రూ.1.80 లక్షల నుంచి రూ.2.20 లక్షల ఖర్చు అవుతుంది. రూ.90వేల వరకూ రాయితీ పొందవచ్చు. ఇంటి అవసరాలకు విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే.. చాలా వరకూ మిగలనుంది. దానిని డిస్కంలకు అమ్మి కొంత ప్రయోజనం కూడా పొందవచ్చు,

  • వినియోగించుకోవాలి

  • సోలార్‌ యూనిట్ల ఏర్పాటుతో చాలా ప్రయోజనం. సూర్యఘర్‌ పథకం కింద సోలార్‌ ప్లాంట్లు మంజూరవుతాయి. దీనికి రాయితీ సైతం అందిస్తారు. మిగులు విద్యుత్‌ను సైతం డిస్కంలు కొనుగోలు చేస్తాయి. దీనిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.

    - గోవిందరావు, ఏఈ, విద్యుత్‌ శాఖ, ఇచ్ఛాపురం

Updated Date - Sep 05 , 2026 | 12:16 AM