Share News

భూసార పరీక్ష.. రైతులకు రక్ష

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:32 PM

Soil sample collection అధిక దిగుబడి సాధించాలన్న తపనతో రైతులు పరిమితికి మించి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు. దీంతో భూమి సారం కోల్పోయి.. పంటల దిగుబడి తగ్గుతోంది. పెట్టుబడి డబ్బులు కూడా చేతికి అందక రైతులు నష్టపోతున్నారు.

 భూసార పరీక్ష.. రైతులకు రక్ష
నరసన్నపేటలో మట్టి నమూనా తీస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది

  • శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే సత్ఫలితాలు

  • పెట్టుబడి తగ్గి.. అధిక దిగుబడి

  • 39,564 మట్టినమునాల సేకరణ లక్ష్యం

  • నరసన్నపేట, మార్చి 9(ఆంధ్రజ్యోతి): అధిక దిగుబడి సాధించాలన్న తపనతో రైతులు పరిమితికి మించి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు. దీంతో భూమి సారం కోల్పోయి.. పంటల దిగుబడి తగ్గుతోంది. పెట్టుబడి డబ్బులు కూడా చేతికి అందక రైతులు నష్టపోతున్నారు. అంతేగాక ప్రకృతి వరప్రసాదినిగా ఉన్న పోషకాలు సైతం మొక్కలకు అందకపోవడం గమనార్హం. భూమిలో కొంత పరిమాణంలో సహజ సిద్ధంగా లవణ పరిమాణం, నత్రజని, పొటాష్‌ వంటి పోషకాలు ఉంటాయి. అవి ఎంతమేర మొక్కలకు లభ్యమవుతున్నాయో.. వేయబోతున్న పంటకు అవి ఎంత అవసరమో రైతులు నిర్ధారించుకున్నాకే ఎరువులు వినియోగించాలి. భూసార పరీక్షలు చేయిస్తేనే ఆ సమాచారం తెలుస్తుంది. కానీ భూసార పరీక్షలు చేయకుండా ఇష్టారాజ్యంగా ఎరువులు వేయడంతో పెట్టుబడి పెరగడమే కాకుండా భూసారం తగ్గి.. క్రమేపీ చౌడు భూమిగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 39,564 భూసార పరీక్షలు నిర్వహించాలని వ్యవసాయశాఖ అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే మట్టి నమూనాల సేకరణ ప్రారంభించారు. మే నెలాఖరు వరకూ ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.

  • మట్టి నమూనాల సేకరణ ఇలా..

  • మట్టి నమూనాను తీయించాలనుకున్న రైతు తన పేరు, ఆధార్‌కార్డు, గ్రామం, పొలం సర్వే నెంబర్‌, సాగు పంట స్థితి, జీపీఎస్‌, కోఆర్డినేటర్‌ గతేడాది మట్టినమూనా సేకరించిన తేదీ, సెల్‌ఫోన్‌ నెంబర్‌ను అధికారులకు అందజేయాలి. వారు పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించి ఏఏ ధాతువుల లోపం ఉంది... ఎరువులను ఎంతెంత మోతాదులో వేయాలో చెబుతారు. ఆ సమాచారం సంబంధిత రైతు ఫోన్‌కు సందేశం రూపంలో వస్తుంది.

  • భూసార పరీక్షలను ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో చేస్తున్నారు. పలాస, పాలకొండలో కూడా భూసార పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

  • భూసార పరీక్ష నివేదికను అనుసరించి మూడేళ్లపాటు సేద్యం చేయవచ్చు.

  • ప్రస్తుతం రాయితీపై అందజేసే జింక్‌, జిప్సం, విత్తనాలు తదితర వాటికి నమూనాలు చేయించుకున్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • పొలంలో 10 నుంచి 12 చోట్ల మట్టిని సేకరించి.. ఆ ప్రాంతాల్లో త్రిభూజాకారంలో 6 నుంచి 8 అంగుళాల మేర గుంత తవ్వాలి. పైపొర నుంచి కింద వరకు ఒకే మందంలో పలుచని పొర వచ్చేలా మట్టిని తీయాలి. ఈ మట్టిని సేకరించి గోనె సంచి మీద వేసి... నాలుగు భాగాలుగా విభజించాలి. ఎదురెదురుగా ఉన్న మట్టిని రెండు భాగాలుగా కలపాలి. ఇలా చేసి సుమారు అరకిలో మట్టి మిగిలేలా చేయాలి. సేకరించిన మట్టి నమునాను ఒక కవర్‌లో వేసి వ్యవసాయశాఖ అధికారులకు అందజేస్తే భూసార పరీక్షలను నిర్వహించి ఫలితాలను అందజేస్తారు. మట్టి నమునాలో గ్రేడు విధానం అవలంభించడం వల్ల చుట్టుపక్కల సరాసరి పది మంది రైతుల భూసారం కూడా తెలుసుకునేందు వీలు కలుగుతుంది. గరిష్ఠంగా 5 ఎకరాల వరకూ ఒక నమూనా తీయాలి.

  • భూసార పరీక్షలతో దిగుబడి

  • రైతులంతా వారి పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. ఫలితాల మేరకు ఎరువులు వినియోగిస్తే ఖర్చు తగ్గుతుంది. దీనిపై గ్రామాల్లో రైతులకు వ్యవసాయ సిబ్బంది సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈఏడాది నరసన్నపేట సబ్‌ డివిజన్‌లో 2,800 మట్టి నమూనాలు తీయాలని లక్ష్యంగా నిర్ణయించాం.

    - వెంకటమధు, వ్యవసాయ సహాయ సంచాలకుడు, నరసన్నపేట

Updated Date - Mar 09 , 2026 | 11:32 PM