మంచు.. ఎండ
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:46 AM
జిల్లాలో గత వారం రోజులుగా భిన్న వాతావరణం చోటుచేసుకుంటుంది.
- జిల్లాలో భిన్న వాతావరణం
- ఉదయం 8 వరకు దట్టంగా పొగమంచు
- ఆ తరువాత ప్రతాపం చూపుతున్న భానుడు

టెక్కలిలో ఉదయం 11 గంటలకు ఖాళీగా కనిపిస్తున్న రోడ్డు
టెక్కలి రూరల్/నరసన్నపేట, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత వారం రోజులుగా భిన్న వాతావరణం చోటుచేసుకుంటుంది. ఉదయం 8 వరకూ దట్టమైన పొగ మంచు కురుస్తుంటే.. ఆ తరువాత భానుడు ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం ఐదు గంటల వరకూ సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. ఈ భిన్న వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా పొగమంచు కురిసింది. రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. ఇంటర్ పరీక్ష రాసే అభ్యర్థులు కేంద్రాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. ఆ తరువాత మంచు తెరలు తొలగిపోయి ఎండ రావడం మొదలైంది. సాయంత్రం వరకూ సూర్యుడు చుర్రుమన్నాడు. శుక్రవారం టెక్కలిలో 38 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ఉక్కబోతకు వృద్ధులు, చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రతి ఏడాదీ ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు తీవ్రంగా ఉంటాయి. కానీ, ఏ ఈ ఏడాది మార్చి తొలి వారం నుంచే భానుడు భగభగమంటున్నాడు. దీంతో పలుచోట్ల చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రజలు తాగు నీటికి కష్టాలు పడే పరిస్థితి కనిపిస్తుంది.