డబ్బుల కోసం గంజాయి స్మగ్లింగ్
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:01 AM
ww
పలాస, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): డబ్బులకు ఆశపడి గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా కాశీబుగ్గ పోలీసులకు తమిళనాడు రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు మంగళ వారం పట్టుబడ్డారు. కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని కథనం మేరకు.. తమిళనాడులోని తిరువెళ్లూరుకి చెందిన సర్వసన్‌ఫలని, అదే పట్టణానికి చెందిన భూపాలన్, దిండి గల్‌కు చెందిన మాసన్, సంగారి గ్రామానికి చెందిన హరిబాబు పెయింటింగ్ పనులు చేసుకుంటు ఒకరికొకరు పరిచయమయ్యారు. సూళ్లూరుపేట బోర్డరు వద్ద కలుసుకొన్న వీరు గంజాయి, సిగరెట్లు, మద్యాన్ని సేవిస్తుంటారు. ఆ ప్రాంతంలో బాలాజి అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసుకొని తాగుతుంటారు. వీరి పరిస్థితి, ఆర్ధిక స్థితిని గుర్తించిన బాలాజి ఒడిశాలో గంజాయి లభ్యమవుతుందని, అక్కడ నుంచి తీసుకొని తనకు విక్రయిస్తే కిలోకు రూ. ఐదు వేలు నగదు ఇస్తామని తెలియజేశాడు. దీంతో పర్లాకిమిడిలో గంజాయి విక్రయించే ఆనంద్‌ను కలుసుకొని సర్వసన్‌ఫలని, భూపాలన్, మాసన్, హరిబాబు పలుమార్లు కొనుగోలు చేసి సూళ్లూరుపేటలో ఉన్న బాలాజికి అనేక మార్లు సరఫరా చేశారు. దీంతోపాటు తమిళనాడుకు కూడా అనేక మార్లు గంజాయి తరలించి డబ్బులు సంపాదించారు. కాగా మంగళవారం ఉదయం వీరు నలుగురు కలిసి 32.590 కిలోల గంజాయిని బస్సులో తీసుకువచ్చి పలాస రైల్వే స్టేషన్ మీదుగా తమిళనాడు వెళ్లడానికి సిద్ధమయ్యారు. బ్యాగులను గుర్తించిన కాశీబుగ్గ ఎస్‌ఐ జి.దుర్గాప్రసాద్ వారిని ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. వీరితో తరలిస్తున్న లగేజి బ్యాగులో దుస్తులకు బదులు గంజాయి ప్యాకెట్లు లభించడం తో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే నలుగుర్ని అదుపులోకి తీసుకొని వివరాలు రాబట్టారు. మిగిలిన నిందితులపై కూడా కేసు నమోదు చేశారు. వీరిని పలాస కోర్టులో హాజరుపరచగా అంపోలు జైలుకు రిమాండ్‌కు తరలించాలని న్యాయాధికారి ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.