Share News

నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:44 PM

Management Committee Elections in Government Schools ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం నిర్వహించనున్నారు. జిల్లాలో 2,612 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహనకు విద్యాశాఖ, సమగ్రశిక్షాభియాన్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు
నరసన్నపేటలో బోర్డు ఉన్నత పాఠశాల

2,612 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం నిర్వహించనున్నారు. జిల్లాలో 2,612 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహనకు విద్యాశాఖ, సమగ్రశిక్షాభియాన్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎస్‌ఎంసీ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. పాఠశాలలో 100 మంది లోపు విద్యార్థులు ఉంటే 12-15 మంది సభ్యులు, 100-500 వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలో 15-20 మంది సభ్యులు, 500 కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలో 20-25 మంది సభ్యులను ఎన్నుకోవాలి. ఎస్‌ఎంసీలో 50శాతం మహిళలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రాతినిఽథ్యం తప్పనిసరి. 12 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకు సభ్యుల ఎన్నిక అవసరం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ సభ్యులుగా ఉంటారు. కానీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాలి. అలాగే ఒకే పాఠశాలలో ఇద్దరు.. ముగ్గురు పిల్లలు చదువుతున్న తల్లిదండ్రులు.. ఒక్క ఓటుమాత్రమే వేయడానికి అవకాశం ఉంటుంది.

చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ఇలా

స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుల ఎన్నిక పూర్తయిన తరువాత.. వారిలో(విద్యార్థుల తల్లిదండ్రుల) నుంచి చైర్మన్‌, వైస్‌చైర్మన్లను ఎన్నుకోవాలి. ప్రతి సందర్భంలో 50శాతం కోరం ఉండాలి. సమాన ఓటు అయితే డ్రా తీసి నిర్ణయించాలి. గతంలో రెండుసార్లు చైర్మన్‌ లేదా వైస్‌చైర్మన్‌గా పోటిచేసి గెలిచినవారు ప్రస్తుత ఎన్నికల్లో తిరిగి పోటి చేయరాదు. కమిటీ ఎన్నిక అయిన తరువాత మిగతా 25 శాతంలో ఏఎన్‌ఎం లేదా, ఆశవర్కర్లు లేదా పూర్వవిద్యార్థుల్లో ఒకరిని ఎంపిక చేయాలి. ఉపాధ్యాయుల నుంచి ఒకరు, స్థానికసంస్థల నుంచి ఒక సభ్యున్ని ఎంపిక చేయాలి. ఈ ఎస్‌ఎంసీల కాలపరిమితి రెండేళ్లు. పాఠశాల సమగ్రాభివృద్ధి కోసం నిర్వహించే ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:44 PM