Share News

ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:04 AM

SMC elections at srikakulam ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. మంగళవారం జిల్లాలోని 2,593 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు.

ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు
నరసన్నపేట: సత్యవరం పాఠశాలలో ఎస్‌ఎంసీ చైర్మన్‌, వైస్‌చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

  • జిల్లాలో 2,593 పాఠశాలల్లో నిర్వహణ

  • 31 చోట్ల మాత్రం వాయిదా

  • శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌/ సరుబుజ్జిలి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. మంగళవారం జిల్లాలోని 2,593 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. కోటబొమ్మాళి, నరసన్నపేట, జి.సిగడాం, గార, సారవకోట, ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, కంచిలి, మందస, సంతబొమ్మాళి తదితర మండలాల్లో ఉదయం 12 గంటలకు దాదాపు ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్ని మండలాల్లోని పాఠశాలల్లో మాత్రం గందరగోళం పరిస్థితి ఏర్పడింది. పోలాకి మండలం ఈదులవలస మోడల్‌ స్కూల్‌ కమిటీ ఎన్నికల ప్రక్రియ కోరం లేకపోవడంతో వాయిదా పడింది. ఆమదాలవలస మునిసిపాలిటీ పరిధిలోని మెట్టక్కివలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. పలు పాఠశాలల్లో కోరం లేక.. తల్లిదండ్రులు ఉన్నా.. గార్డియన్‌కు ఓటు ఇవ్వడం తదితర కారణాలతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇలా జిల్లాలో సుమారు 31 పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికల వాయిదా పడ్డాయి. మిగతా 2,562 పాఠశాలల్లో ప్రశాంతగా ఎన్నికల జరిగాయి. వీటిలో దాదాపు 80శాతం పాఠశాలలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ‘ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కొన్ని సాంకేతిక కారణాలతో సుమారు 31 పాఠశాలల్లో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయ’ని సమగ్రశిక్ష ఏపీసీ పప్పల వేణుగోపాలరావు తెలిపారు.

  • డబ్బుల పంపిణీ.. ఎన్నిక వాయిదా

  • సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో ఎస్‌ఎంసీ ఎన్నికల్లో.. ఓటర్లకు(విద్యార్థుల తల్లిదండ్రులకు) డబ్బులు పంపిణీ చేయడంతో ఎన్నిక వాయిదా వేశామని ఎంఈవో డి.బాలరాజు తెలిపారు. మంగళవారం మండలంలో 41 ప్రాథమిక పాఠశాలలు, ఏడు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలు, ఒక గిరిజన బాలికల ఉన్నత పాఠశాలకు ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాం. 44 పాఠశాలల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఐదు పాఠశాలల్లో వాయిదా పడ్డాయి. పురుషోత్తపురం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఎన్నికలకు సంబంధించి సోమవారం రాత్రి కొంతమంది వ్యక్తులు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారం అందింది. ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి వారి నుంచి వాంగూల్మాలు తీసుకున్నారు. ఎస్‌ఐ ఇచ్చిన నివేదిక మేరకు ఆ పాఠశాలలకు ఎస్‌ఎంసి ఎన్నికలు వాయిదా వేశాం. అలాగే కొండ్రగూడ, బుడ్డివలస ప్రాథమిక పాఠశాలలు, సరుబుజ్జిలి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ఎన్నికలను వాయిదా వేశామ’ని ఎంఈవో బాలరాజు తెలిపారు.

Updated Date - Sep 30 , 2026 | 12:04 AM