Share News

బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి ఆరేళ్ల జైలు

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:53 PM

సంతబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాలికపై అసభ్యంగా వ్యవహ రించిన వ్యక్తిపై 2022లో నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో శ్రీకాకుళం పోక్సో కోర్టు న్యాయాధికారి ఎన్‌.సునీత శుక్రవారం నిందితుడికి ఆరేళ్లు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించారు.

బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి ఆరేళ్ల జైలు

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాలికపై అసభ్యంగా వ్యవహ రించిన వ్యక్తిపై 2022లో నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో శ్రీకాకుళం పోక్సో కోర్టు న్యాయాధికారి ఎన్‌.సునీత శుక్రవారం నిందితుడికి ఆరేళ్లు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించారు. ఈ మేరకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. నిందితుడు గొర్లె దాలయ్య బాలికకు వరుసకు చిన్నాన్న అవుతాడు. ఇతడు రాజమండ్రిలో ఓ హోటల్‌లో పనిచేస్తే అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి కొద్ది రోజులు ఉండేవాడు. ఈ నేపథ్యంలో బాలికతో చనువుగా ఉండి బుగ్గలు గిల్లడం వంటి పనులు చేస్తుండేవాడు. అయినా వరుసకు చిన్నాన్న అవుతాడు కాబట్టి ఆమె తప్పుగా భావించలేదు. అయితే 2022 జూన్‌ 16న బాలిక ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు దాలయ్య ఇంటిలోకి ప్రవేశించి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అప్పటి ఎస్‌ఐ ఎం.గోవింద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాక్ష్యాధారాలను సేకరించిన అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరపున పబ్లిక్‌ ప్రాసి క్యూటర్‌ విశాలాక్షి వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి పోక్సో కోర్టు న్యాయాధికారి సునీత జైలుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ ఆ ప్రకటనలో తెలిపారు.

గంజాయి కేసులో నిందితుడు విశాఖ జైలుకు...

టెక్కలి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): టెక్కలి ప్రాంతంలో రెండు గంజాయి కేసుల్లో పట్టుబడ్డ ఓ నిందితుడిని విశాఖ సెంట్రల్‌ జైల్‌కు తరలించాలని ఎక్సైజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌కుమార్‌ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఆదిఆంధ్రా వీధికి చెందిన దాసరి మౌళి కుమార్‌ 2023 జూలై 8న నౌపడ-మెళియాపుట్టి రోడ్డులో 21.695 కిలోల గంజాయితో పోలీసులకు చిక్కాడు. అలాగే ఈ ఏడాది జూన్‌ 16న 2.155 కిలోల గంజాయితో టెక్కలి-మెళియాపుట్టి రోడ్డులో మరోసారి పోలీసులకు చిక్కాడు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి అమ్మకాలు చేయడం వంటి నేరాలకు సంబంధించి పీటీఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌1988 కింద శ్రీకాకుళం అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్న మౌళీకుమార్‌ను విశాఖ సెంట్రల్‌జైలుకు తరలించాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

Updated Date - Oct 30 , 2026 | 11:53 PM