సార్.. సర్టిఫికెట్లు
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:31 AM
జిల్లాలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖకు స్టేషనరీ సమస్య వేధిస్తోంది. అవసరమైన స్టేషనరీ అందుబాటులో లేకపోవడంతో సర్టిఫికెట్ల కోసం ప్రజలు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
- ధ్రువపత్రాలకు ఎదురుచూపు
- దరఖాస్తు చేసినా మంజూరు కావట్లే
- స్వర్ణ గ్రామ, వార్డుశాఖల్లో స్టేషనరీ కొరత
- మీ సేవ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి
- కొత్త పేపర్లు పంపిణీ చేయని ప్రభుత్వం
- విద్యార్థులు, ప్రజలకు తప్పని ఇబ్బందులు
- పలాసకు చెందిన ఒక విద్యార్థి ఇటీవల ఏపీఈఏపీ సెట్‌లో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు సాధించాడు. ఇంజనీరింగ్ ప్రవేశానికి నిర్వహించే కౌన్సెలింగ్‌కు కుల ధ్రువీకరణ పత్రం అవసరం కావడంతో స్వర్ణ గ్రామ శాఖలో దరఖాస్తు చేసుకున్నాడు. నాలుగు రోజులు అవుతున్నా కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం లేదు. దీనిపై స్వర్ణ గ్రామ సిబ్బందిని ప్రశ్నిస్తే స్టేషనరీ కొరత కారణంగా సర్టిఫికెట్ ప్రింట్ ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో ఆ విద్యార్థి ఆవేదన చెందుతున్నాడు.
-నరసన్నపేట మండలం కంబకాయి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం వారం రోజుల కిందట దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అధికారులకు సమర్పించాడు. అయితే, స్టేషనరీ లేకపోవడంతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు.
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, జూలై 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖకు స్టేషనరీ సమస్య వేధిస్తోంది. అవసరమైన స్టేషనరీ అందుబాటులో లేకపోవడంతో సర్టిఫికెట్ల కోసం ప్రజలు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దరఖాస్తు చేసుకున్నా రోజుల తరబడి ధ్రువపత్రాలు మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖగా మార్చింది. సర్టిఫికెట్లకు సంబంధించి సచివాలయ పేపర్లకు బదులుగా సర్ణ గ్రామం, వార్డు శాఖ పత్రాలను వినియోగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పాత స్టేషనరీని స్వాధీనం చేసుకుంది. ఇకపై కొత్త పేపర్లపై మాత్రమే సర్టిఫికెట్లు ప్రింట్ చేసి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సమస్య తలెత్తింది. సర్టిఫికెట్ల కోసం మీ సేవ కేంద్రాలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖలకు వెళ్తే పేపర్ లేదంటూ సమాధానం వినిపిస్తోంది.
12వేల మంది దరఖాస్తు..
నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకావడంతో విద్యార్థులకు జనన, కుల, ఆదాయం, ఈడబ్ల్యూఎస్ వంటి సర్టిఫికెట్లు అవసరం పడింది. అలాగే వృద్ధాప్య, వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతున్నాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు 1బీ, అడంగళ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, పొజిషన్, క్యారెక్టర్, ఎఫ్‌ఎంసీ, పోలీస్ ఇమ్యూయెన్స్, మిస్సింగ్ డాక్యుమెంట్స్, బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. గత రెండు వారాల్లో జిల్లాలో వివిధ ధ్రువపత్రాల కోసం ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించిన వారు 12వేల మంది వరకు ఉన్నారు. అధికారులు ఈ దరఖాస్తులను పరిశీలించి సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే మీసేవ కేంద్రాలు, సర్ణ గ్రామం, వార్డు శాఖల్లో రాజముద్ర, హోల్‌గ్రాంతో కూడిన స్టేషనరీ కొరత కారణంగా సర్టిఫికెట్లను ప్రింట్ ఇవ్వడం లేదు. దీంతో దరఖాస్తుదారులు సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.
తప్పని ఇబ్బందులు..
గత 20 ఏళ్లుగా ఏపీ ఆన్‌లైన్ కింద పనిచేస్తున్న మీసేవ సర్వీసులను రెండు నెలల కిందట సీఎంఎస్ కిందకు మార్చారు. దీనికితోడు ప్రభుత్వం సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డుగా మార్చింది. వైసీపీ ప్రభుత్వంలో జారీ చేసే సర్టిఫికెట్లపై జగన్ బొమ్మ ఉండేది. కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంతో సర్టిఫికెట్లను జారీ చేస్తోంది. స్టేషనరీపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు లోగోలను ముద్రించి వాటి ద్వారానే సర్టిఫికెట్లను ప్రజలకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ కొత్త స్టేషనరీని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు, మీ సేవ కేంద్రాలకు ఇంకా పంపిణీ చేయపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో స్టేషనరీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై సీఎంఎస్ మీసేవ కేంద్రాల జిల్లా అధికారి రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ‘స్టేషనరీ ముద్రించగానే నేరుగా మీసేవ కేంద్రాలకు పంపిస్తున్నాం. కొన్ని మీ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి.’ అని తెలిపారు.
ఇబ్బందులు పడుతున్నాం
విద్యాలయాలు ప్రారంభంకావడంతో విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువపత్రాల అవసరం ఉంటుంది. వీటికోసం కోసం దరఖాస్తు చేస్తున్నారు. గత రెండు వారాలుగా స్టేషనరీ లేక సర్టిఫికెట్లు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్ జరిగే సమయానికి ధ్రువపత్రాలు లేకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.
పోగోటి అప్పలనాయుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు , కంబకాయి
స్టేషనరీ అందజేయాలి
మీ సేవ కేంద్రాల్లో స్టేషనరీ నిండుకోవడంతో దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేకపోతున్నాం. స్టేషనరీ కోసం ఇండెంట్ పెట్టినా రావడం లేదు. వివిధ రకాల సర్టిఫికెట్ల జారీ కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్టేషనరీని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి.
-బి.శివకుమార్ , మీసేవ నిర్వహకుడు