Share News

‘సర్‌’ను పక్కాగా చేపట్టాలి

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:36 PM

ప్రత్యేక సమగ్ర సర్వే (సర్‌)ను పక్కాగా చేపట్టాలని ఈఆర్వో, జడ్పీ సీఈవో ఆర్‌.వెంకట్రామన్‌ ఆదేశించా రు.

‘సర్‌’ను పక్కాగా చేపట్టాలి
పాతపట్నం: మాట్లాడుతున్న జడ్పీ సీఈవో వెంకట్రామన్‌

- అర్హులందరూ ఓటర్లగా నమోదు కావాలి

- బోగస్‌ ఓటర్లు ఉండకూడదు

- ఈఆర్వో, జడ్పీ సీఈవో వెంకట్రామన్‌

పాతపట్నం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర సర్వే (సర్‌)ను పక్కాగా చేపట్టాలని ఈఆర్వో, జడ్పీ సీఈవో ఆర్‌.వెంకట్రామన్‌ ఆదేశించా రు. స్థానిక కేఎస్‌ఎం ప్లాజాలో శనివారం పాతపట్నం, మెళియాపుట్టి మండలాల బీఎల్వోలు, సూపర్‌ వైజర్లకు ‘సర్‌’ నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15నుంచి జూలై 14 వరకు సర్‌ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతీ ఓటరుకు రెండేసి ఎన్యుమరేషన్‌ పత్రాలను అందజేయాలన్నారు. ఓటరు పుట్టిన తేదీ, ఆధార్‌, మొబైల్‌ నెంబరు, ఎపిక్‌ నెంబర్‌లను నింపాలన్నారు. నింపిన పత్రంపై కొత్తగా తీసిన కలర్‌ ఫొటోను అతికించి బీఎల్వోలు భధ్రపరచాలన్నారు. నింపిన రెండు పత్రాల్లో ఒకదానిపై బీఎల్వో సంతకంతో ఓటరుకు రశీదుగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఓటరు మ్యాపింగ్‌, నమోదు, తొలగింపులు వంటి ప్రక్రియలపై దిశానిర్దేశం చేశారు. అర్హులందరూ ఓటరుగా నమోదై ఉండాలని, బోగస్‌ ఓటర్లు ఉండకూడదని అన్నారు. కార్యక్రమంలో పాతపట్నం, మెళియాపుట్టి ఈవోఆర్‌వోలు, తహసీల్దార్లు నందిగామ ప్రసాదరావు, బి.పాపారావు, ఎలక్షన్‌ ఇన్‌చార్జి, డీటీ బగాది వెంకటరమణ, ఎంపీడీవోలు హెచ్‌వీ రమణమూర్తి, పండ, రెండు మండలాలకు చెందిన 158 బీఎల్వోలు, సూపర్‌ వైజర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 11:36 PM