Share News

సింగపూర్‌ విద్యావిధానం భేష్‌

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:54 PM

Singapore's teaching method... beneficial if implemented కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టిసారించింది. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అందుకోవాలనే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ ఏడాది మే 4 నుంచి 8 వరకు సింగపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో కరిక్యూలమ్‌, విద్యావిధానం, బోధన పద్ధతులను పరిశీలించేందుకు మొదటి దశలో 37 మంది ఉపాధ్యాయులను అక్కడకు పంపించారు.

సింగపూర్‌ విద్యావిధానం భేష్‌
సింగపూర్‌లోని ఒక పాఠశాల అధ్యయనంలో పాల్గొన్న ఉపాధ్యాయులు (ఫైల్‌)

  • ప్రత్యక్ష అనుభవంతోనే పాఠాలు

  • సీపీఏ విధానంతో గణితం, సైన్స్‌ అభ్యసనం

  • అక్కడి బోధన పద్ధతులను ఇక్కడ అమలు చేస్తే మేలు

  • ఆ దేశంలో పర్యటించిన జిల్లా ఉపాధ్యాయుల అభిప్రాయం

  • శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టిసారించింది. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అందుకోవాలనే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ ఏడాది మే 4 నుంచి 8 వరకు సింగపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో కరిక్యూలమ్‌, విద్యావిధానం, బోధన పద్ధతులను పరిశీలించేందుకు మొదటి దశలో 37 మంది ఉపాధ్యాయులను అక్కడకు పంపించారు. తిరిగొచ్చిన ఆ ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్‌ ఇటీవల సమావేశమై పలు అంశాలపై చర్చించారు. జిల్లా నుంచి గురుకుల పాఠశాలలు జిల్లా కోర్డినేటర్‌ వై.యశోదలక్ష్మి, నేలబొంతు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం బి.విజయభారతి ఈ పర్యటనలో పాల్గొన్నారు. సింగపూర్‌లోని బోధన పద్ధతులు, విద్యావిధానాలు బాగున్నాయని వారు వెల్లడించారు. ఈ మేరకు తమ అభిప్రాయాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

  • అన్నీ ప్రభుత్వ పాఠశాలలే..

  • సింగపూర్‌లో అన్నీ ప్రభుత్వ పాఠశాలలే. పూర్వప్రాథమిక విద్య రెండేళ్లు. ప్రాథమిక విద్య ఆరేళ్లు. మాధ్యమిక, సెకండరీ నాలుగు సంవత్సరాలు ఉంటాయి. విద్యార్థులు నామమాత్రపు రుసుం చెల్లించాలి. రుసుం చెల్లించలేని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు అవసరమైన పనిలో భాగస్వామి కావాలి. ప్రతీ పదేళ్లకు ఒకసారి అన్ని తరగతుల కరిక్యూలమ్‌ మారుస్తారు. తాజాగా కృత్రిమ మేథ, మెషీన్‌ లెర్నింగ్‌ అక్కడ కరిక్యూలమ్‌లో చేర్చారు. ఇంటర్‌ తరువాత ప్రతి విద్యార్థి రక్షణ, పోలీసుశాఖలో రెండేళ్లు పనిచేయాలి. ఆ తర్వాతే డిగ్రీ చదువుకునేందుకు అవకాశం ఉంటుంది.

  • యూనెంగ్‌ ప్రైమరీ స్కూల్‌, ఎన్‌ఐఈ సింగపూర్‌లో అత్యంత ఆకట్టుకున్న అంశం తరగతి గది వాతావరణం. విద్యార్థులు కేవలం వినేవారిగా కాకుండా ప్రశ్నలు అడగడం, చర్చించడం, బృందాలుగా కలిసి పనిచేయడం, భావాలను వివరించడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉపాధ్యాయులు బోధకులుగా కాకుండా అభ్యాసాన్ని సులభతరం చేసే మార్గదర్శులుగా వ్యవహరిస్తారు.

  • తరగతి గదుల్లో వినూత్న బోధనా పద్ధతులు విద్యార్థుల అభ్యసన ఫలితాలను పెంచడానికి ఉపయోగపడుతున్నాయి. సరళమైన, ఆకర్షణీయమైన భవిష్యత్‌కు తరగతి నుంచే వ్యూహాలు మొదలవుతాయి. ప్రశ్నించడం, చర్చల ఆధారిత అభ్యాసం ద్వారా విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు పెంపొందించుకునేలా విద్యా విధానం ఉంటుంది.

  • ముఖ్యమైన పద్ధతులు ఇవే ..

  • సీపీఏ విధానం (కాంక్రీట్‌- పిక్టోరియల్‌- అబ్ర్సాక్ట్‌ )లో విద్యార్థులు ముందుగా వస్తువుల ద్వారా ప్రత్యక్ష అనుభవంతో భావనను నేర్చుకుని, తరువాత చిత్రాల రూపంలో అర్థం చేసుకుని, చివరిగా సంకేతాలు, సూత్రాల రూపంలో అభ్యసిస్తారు. ఈ విధానం గణితం,సైన్స్‌ సబ్జెక్టుల్లో భావనాత్మక అవగాహన పెంచేందుకు దోహదం చేస్తుంది.

  • ఒకే పాఠంలో విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా భిన్నస్థాయిల పనులను ఉపాధ్యాయులు రూపొందించడం వల్ల ప్రతీ విద్యార్థి తన స్థాయికి అనుగుణంగా నేర్చుకునే అవకాశం పొందుతాడు.

  • ఉపాధ్యాయులంతా పాఠాలను రూపొందించడం, తరగతి బోధనను పరిశీలించడం, అనంతరం చర్చించి మెరుగుపరచడం ద్వారా బోధనలో నాణ్యత ఉంటుంది.

  • మన రాష్ట్రంలో ఇలా చేస్తే మేలు..

  • మన రాష్ట్రంలో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు గణితం, సైన్స్‌ బోధనలో సీపీఏ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ప్రాజెక్టులు, ప్రజెంటేషన్లు, అనుభవాత్మక అభ్యాసం ద్వారా నైపుణ్య ఆధారిత అభ్యాసాన్ని బలోపేతం చేయవచ్చును.

  • ప్రస్తుతం అమల్లో ఉన్న 60:40 మూల్యాంకన విధానంలో నిరంతర, నైపుణ్య ఆధారిత మూల్యాంకనానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి.

  • ప్రతి వారం ఉపాధ్యాయుల మధ్య లెసన్‌ స్టడీ.. సహచర అభ్యాస సమావేశాలను నిర్వహించాలి.

  • పోటీ కంటే పరస్పర సహకారాన్ని ప్రోత్సహించే ప్రొఫెషనల్‌ లెర్నింగ్‌ కమ్యూనిటీలను ఏర్పాటు చేయాలి.

  • విమర్శనాత్మక ఆలోచన, సంభాషణ నైపుణ్యాలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించే బోధనా వ్యూహాలను తరగతి గదుల్లో అమలు చేయాలి.

  • ఉత్తమ పద్ధతులు అనుసరించాలి

  • సింగపూర్‌ విద్యా అధ్యయన పర్యటన ద్వారా ఉపాధ్యాయుల సాధికారిత, సహకార సంస్కృతి, విద్యార్థి-కేంద్రీత బోధన, నిరంతర అభివృద్ధి వంటి అంశాలే విజయానికి ప్రధాన ఆధారాలు అని స్పష్టమైంది. సింగ్‌పూర్‌ విధానాన్ని పూర్తిగా అనుకరించాల్సిన అవసరం లేదు. అయితే, అక్కడ చేపడుతున్న ఉత్తమ బోధన పద్ధతులను రెసిడెన్షియల్‌ పాఠశాలలు, రాష్ట్ర పాఠశాలల అవసరాలకు అనుగుణంగా అమలు చేస్తే బాగుంటుంది. దీనివల్ల విద్యార్థుల్లో లోతైన అవగాహన, ఆలోచనా శక్తి, సమర్థవంతమైన సంభాషణ, బాధ్యతాయితమైన పౌరసత్వం వంటి లక్షణాలు పెంపొందించవచ్చు.

    - వై.యశోదలక్ష్మి, జిల్లా కో ఆర్డినేటర్‌, ఏపీ గురుకుల విద్యాలయాలు

  • బోధన విధానాల్లో మార్పులు

  • సింగపూర్‌లో విద్యార్థులు వివిధ అంశాలపై పట్టు సాధించేలా ప్రోత్సహిస్తారు. నాయకత్వ లక్షణాలు, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందిస్తాయి. ఆ విఽధంగా ఇక్కడ కూడా బోధన విధానాల్లో మార్పులు చేసుకోవాలి. ఆశ్రమ పాఠశాలల్లో పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలతో గ్రూప్‌ డిస్కషన్‌, ప్రశ్నించడం, చర్చల ఆధారిత అభ్యాసం ద్వారా ఆలోచన నైపుణ్యాలను పెంచడం బాగా తెలిసింది. మా పాఠశాలలో వీటిని కొనసాగిస్తాం.

    - బి.విజయభారతి, హెచ్‌ఎం, గిరిజన ఆశ్రమబాలికోన్నత పాఠశాల, నేలబొంతు

Updated Date - Jul 02 , 2026 | 11:54 PM