ఐపీఎంకు సిక్కోలువాసి ఎంపిక
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:11 AM
DSP Rama Rao to receive medal సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన కరజాడ రామారావు.. పోలీస్‌శాఖలో అత్యుత్తమ అవార్డు ఇండియన్ పోలీస్ మెడల్(ఐపీఎం)కు ఎంపికయ్యారు.
ప్రధాని చేతులమీదుగా మెడల్ అందుకోనున్న డీఎస్పీ రామారావు
స్వగ్రామం బోరుభద్రలో హర్షాతిరేకాలు
సంతబొమ్మాళి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన కరజాడ రామారావు.. పోలీస్‌శాఖలో అత్యుత్తమ అవార్డు ఇండియన్ పోలీస్ మెడల్(ఐపీఎం)కు ఎంపికయ్యారు. 77వ గణతంత్ర దినోత్సవం సంందర్భంగా ఐపీఎం అందుకోనున్న వారి జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో బోరుభద్రకు చెందిన డీఎస్పీ రామారావుకు చోటు దక్కింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన కరజాడ రామారావు విద్యాభాస్యం ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. పదోతరగతి వరకు బోరుభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్,డిగ్రీ టెక్కలి ప్రభుత్వ కళాశాలల్లో చదివారు. 2000లో విజయనగరంలో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత 2005లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. విధుల్లో నిబద్ధతతో రెండుసార్లు శీఘ్ర పదోన్నతి పొంది సీఐగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం విశాఖపట్నంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.
విధి నిర్వహణలో ప్రతిభ చూపుతూ డీఎస్పీ రామారావు పలు అవార్డులను పొందారు. 2009లో ముఖ్యమంత్రి శౌర్య పతకం, 2013, 2019 సంవత్సరాల్లో ఆంత్రిక్ సురక్ష సేవా పతకం, 2017లో శీఘ్ర ప్రమోషన్ (ఎక్యులేరిటెడ్), 2022లో ఉత్‌కృష్ట సేవా పతకం, 2023లో సేవా పతకం పొందారు. తాజాగా ఈ ఏడాది ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు పీఎం మోదీ చేతులమీదుగా ఇండియన్ పోలీసు మెడల్ అందుకోనున్నారు.
సేవా కార్యక్రమాలు
డీఎస్పీ రామారావు చదువుతున్నప్పుడే గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. గ్రామంలో నిలిచిపోయిన శివాలయ నిర్మాణానికి కృషి చేశారు. ఉద్యోగంలో చేరిన తర్వాత గ్రామంలో యువకులు సైనిక ఉద్యోగాలు పొందేలా అవగాహన కల్పించారు. చాలామంది పేద నిరుద్యోగులకు.. తన ఇంటివద్దే ఉంచి.. శిక్షణ ఇప్పించి ఉద్యోగాల సాధనకు కృషి చేశారు. గ్రామ దేవత పాలపోలమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఆర్థికసాయం అందజేశారు. గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా తన వంతు సాయం అందిస్తున్నారు. రామారావు ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపిక కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాను ఐపీఎంకు ఎంపికకావడం ఎంతో ఆనందంగా ఉందని డీఎస్పీ రామారావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇదే స్ఫూర్తితో యువత పోలీసుశాఖలో ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.