Share News

గ్రూప్‌-1 ఫలితాల్లో సిక్కోలు సత్తా

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:57 PM

Selected as DSPs ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గ్రూప్‌-1 ఫలితాల్లో సిక్కోలు వాసులు సత్తా చాటారు. ఇద్దరు డీఎస్పీలుగా ఎంపికై జిల్లాఖ్యాతిని ఇనుమడింపజేశారు

గ్రూప్‌-1 ఫలితాల్లో సిక్కోలు సత్తా
డీఎస్పీలుగా ఎంపికైన శివనాగ గౌరి, సుందరరావు

  • డీఎస్పీలుగా శివనాగ గౌరి, పైల సుందరరావు

  • ఎస్‌.ఎం.పురం, రావులవలసలో సంబరాలు

  • ఎచ్చెర్ల/నరసన్నపేట, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గ్రూప్‌-1 ఫలితాల్లో సిక్కోలు వాసులు సత్తా చాటారు. ఇద్దరు డీఎస్పీలుగా ఎంపికై జిల్లాఖ్యాతిని ఇనుమడింపజేశారు.

  • ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురం గ్రామానికి చెందిన సంపతిరావు శివనాగ గౌరి డీఎస్పీగా ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 25 మంది డీఎస్పీలుగా ఎంపికకాగా, ఇందులో శివనాగ గౌరి ఉండడం విశేషం. ఈమె ప్రస్తుతం వంశధార ప్రాజెక్ట్‌లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏఈఈ)గా పనిచేస్తున్నారు. 2017లో పోలవరం ప్రాజెక్ట్‌కు ఏఈఈగా ఎంపికై, డిప్యూటేషన్‌పై శ్రీకాకుళంలో పనిచేస్తున్నారు. అంతకముందు ఈమె గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(జీఏఐఎల్‌) ఇంజనీర్‌గా ఎంపికయ్యారు. ఈమె ప్రాఽథమిక విద్యాభ్యాసం, పదో తరగతి మునసబుపేటలోని గాయత్రి స్కూల్‌లో చదివారు. అనంతరం ఇంటర్మీడియట్‌ విశాఖపట్నంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థలో, బీటెక్‌ (సివిల్‌) వెల్లూరు (తమిళనాడు)లో పూర్తిచేశారు. ఈమె భర్త చౌదరి అవినాష్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఈమె అత్తమామలు చౌదరి నారాయణమూర్తి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, అత్త చౌదరి ధనలక్ష్మి జడ్పీ చైౖర్‌పర్సన్‌గా గతంలో పనిచేశారు. శివనాగగౌరి గతంలో గ్రూపు-1కు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజాగా రెండో ప్రయత్నంలో విజయం సాధించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • నరసన్నపేట మండలం రావులవలస గ్రామానికి చెందిన పైల సుందరరావు డీఎస్పీగా ఎంపికయ్యారు. రైతు కుటుంబానికి చెందిన ఈయన 2022 సీజేఎల్‌ పరీక్షల్లో ప్రతిభ కనపరిచి ప్రస్తుతం విజయవాడలో గణంకాలశాఖలో అసిస్టెంట్‌ అడిట్‌ అధికారిగా పనిచేస్తున్నారు. తండ్రి పైల రాజరావు వ్యవసాయ పనులు చేస్తున్నారు. తల్లి పైల లక్ష్మిగృహిణి. సోదరి తేజేశ్వరరావు ఉన్నారు. సుందరరావు ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు రావులవలస ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఆరోతరగతి నుండి పదోతరగతి వరకు అంపోలు ఎంజేపీ పాఠశాల, ఇంటర్‌ నాగార్జున సాగర్‌లో చదివారు. ఎన్‌ఐటీ అమీర్‌పుర్‌లో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. బావ బీమారావు మంగళగిరిలోని ఏపీపీఎస్సీలో కానిస్టేబుల్‌గా చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో గ్రూప్‌-1కు సన్నద్ధమయ్యారు. సివిల్స్‌లో ప్రతిభ కనపరచడమే తన లక్ష్యమని సుందరరావు తెలిపారు. డీఎస్పీగా ఎంపికకావడంపై రావులవలసలో పండుగ వాతావరణం నెలకొంది.

Updated Date - Jan 30 , 2026 | 11:57 PM