Share News

చరిత్రలో నిలిచిపోయేలా సిక్కోలు అభివృద్ధి

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:07 AM

Devolopment of srikakulam సిక్కోలు సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఉద్ఘాటించారు.

చరిత్రలో నిలిచిపోయేలా సిక్కోలు అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, పక్కన ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్‌

నేరడి గెజిట్‌ నోటిఫికేషన్‌ చారిత్రాత్మకం

13 నుంచి శ్రీకాకుళం - తిరుపతి మధ్య ‘హమ్‌సఫర్‌’ ఎక్స్‌ప్రెస్‌

ఈ నెలలోనే పలాస కేంద్రీయ విద్యాలయ తరగతులు

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): సిక్కోలు సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఉద్ఘాటించారు. శిలాఫలకాలు వేసి వదిలేయడం వైసీపీకి అలవాటైతే, ఆ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేరడి బ్యారేజీ సాధన కోసం 1961 నుంచి పోరాటం జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ సహకారంతో వరుస భేటీలు జరిపి నేరడిపై చారిత్రాత్మక ట్రిబ్యునల్‌ తీర్పు(గెజిట్‌ నోటిఫికేషన్‌) సాధించాం. నా తండ్రి స్వర్గీయ ఎర్రన్నాయుడు ఆశయం కూడా నేరడి ప్రాజెక్టు. డీపీఆర్‌, నిధుల మంజూరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మౌఖిక ఆదేశాలు కూడా జారీ అయ్యాయ’ని కేంద్రమంత్రి తెలిపారు.

సిక్కోలు నుంచి తిరుపతికి..

‘దశాబ్దాల కల అయిన శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రైలు సర్వీసును సాధించాం. ఈనెల 13న నంబర్‌ 17439/17440తో హమసఫర్‌2 రైలు అందుబాటులోకి రానుంది. అరసవల్లి, తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాల మధ్య ఇది వారధిగా నిలుస్తుంది. అలాగే పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న ఏడు స్టేషన్లను ఖుర్దా నుంచి తప్పించి విశాఖ (వాల్తేరు డివిజన్‌) పరిధిలోకి తీసుకురావడంతో ఉద్దానం ప్రజల కష్టాలు తీరాయి. జిల్లాలో 44 రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ)ల నిర్మాణం చేపడుతాం. ఇందులో 21 టెండర్ల దశలో ఉన్నాయి. పాతపట్నం నీలమణి దుర్గమ్మ ఆలయ దర్శనానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు అక్కడ ఫ్లైఓవర్‌ డిజైన్‌ మార్చాం. ఇందుకు కేంద్రమంత్రి గడ్కరీ అదనంగా రూ.15 కోట్లు మంజూరు చేశారు. ఉద్దానం ప్రజల కోసం ఏప్రిల్‌ నుంచే పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభం అవుతాయి. రూ.55కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో మత్స్యసాగరమాల, శ్రీకూర్మం అభివృద్ధి, అరసవల్లి మాస్టర్‌ ప్లాన్‌పనులు చేపడుతున్నామ’ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

Updated Date - Apr 11 , 2026 | 12:07 AM