సిక్కోలు ‘సమగ్ర’ నివేదిక
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:28 AM
District MLAs to meet CM Chandrababu today వైసీపీ పాలనలో నిధుల లేమితో కుదేలైన జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రజాప్రతినిధులు సన్నద్ధమయ్యారు. మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.
నేడు సీఎం చంద్రబాబునాయుడితో జిల్లా ఎమ్మెల్యేల భేటీ
ఆర్థిక, ఆర్థికేతర అంశాలతో అజెండా సిద్ధం చేసిన ప్రజాప్రతినిధులు
సాగునీరు, వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణపైనే ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో నిధుల లేమితో కుదేలైన జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రజాప్రతినిధులు సన్నద్ధమయ్యారు. మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అభివృద్ధికిగాను ఎమ్మెల్యే సమగ్ర నివేదిక సిద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా ఏయే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి? కొత్తగా ఏం కావాలి? వాటికి ఎంత నిధుల అవసరమనే దానిపై అధికారులతో అంచనాలు రూపొందించారు. పాలనాపరమైన సమస్యలనూ నివేదికలో పొందుపరిచారు. ఈ మేరకు అజెండా వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం : మౌలిక వసతుల విస్తరణ ..
నిధుల అంచనా వ్యయాలు: రామలక్ష్మణ జంక్షన్ నుంచి డేఅండ్ నైట్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణకు రూ.12.15 కోట్లు, కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతీపురం రోడ్డు 4 లేన్ల అభివృద్ధికి రూ.64 కోట్లు, కోడి రామ్మూర్తి స్టేడియం రెండో దశకు రూ.9.40 కోట్లు, పీజీ పేట వద్ద మినీ జెట్టీ, నాగావళి కరకట్టల కోత నివారణకు రూ.98 కోట్లు, అంపోలు బోధి బట్టి డ్రైనేజీ పునరుద్ధరణకు రూ.8 కోట్లు, వంశధార ఆర్‌ఎంసీ 37 టీఈ డిస్ట్రిబ్యూటరీ పెండింగ్ పనులకు రూ.10.10 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదన.
నిధులు అవసరం లేనివి(ఆర్థికేతర) : శ్రీకాకుళం అర్బన్, రూరల్ తహసీల్దార్ కార్యాలయాల విభజన, మొగదలపాడుకు రెవెన్యూ గ్రామ హోదా, ట్యాంక్ బౌండరీల్లో ఉన్న 642 నివాసాల క్రమబద్ధీకరణ, ముంపునకు గురవుతున్న ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన.
ఆమదాలవలస : ప్రాజెక్టులకు పెద్దపీట ..
ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి, పొందూరు మండలాల తాగునీటి కోసం రూ.445 కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు, నారాయణపునం ఆనకట్ట ఆధునికీకరణకు రూ.211.3 కోట్లు. పురుషోత్తమపురం వద్ద వంశధారపై రూ.126.3 కోట్లతో, ముద్దాడపేట వద్ద నాగావళిపై రూ.98.8 కోట్లతో భారీ వంతెనల నిర్మాణం. జగన్నాథపురం-సరుబుజ్జిలి, రాగోలు- పాలకొండ రోడ్ల విస్తరణకు రూ.50 కోట్లు చొప్పున నిధులకు వినతి.
షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, బూర్జ మండలంలో తమ్మినాయుడు పేట, కట్టమయ్యపేట పంచాయతీల విలీనం, ఏసీఈ లీజు రద్దయినందుకు చింతాడ మైదానాన్ని స్టేడియంగా మార్చడం.
పాతపట్నం : ఏళ్ల నాటి సమస్యలకు మోక్షం..
జిల్లేడుపేట, గోపాలపురం వద్ద మహేంద్రతనయ నదిపై వంతెనకు రూ.15 కోట్లు, సీది, కొసమాల, మజ్జిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు రూ. 76.19 కోట్లు, మోడల్ డ్రిగీ కాలేజీ సమీపంలో రూ. 25 కోట్లతో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు, పాతపట్నం సీహెచ్‌సీ రూ.4.64 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు ప్రతిపాదనలు.
వంశధార నిర్వాసితులకు ఇళ్ల పరిహారం, ఇంటి స్థలాల పంపిణీ. పర్యాటకాభివృద్ధి కోసం వంశధార రిజర్వాయర్ వద్ద ఈఓఐ ఆహ్వానం. సోంపేట, కాకరాపల్లి, వంశధార ఉద్యమాల్లో రైతులపై బనాయించిన కేసుల ఉపసంహరణ. మెళియాపుట్టి కేంద్రంగా నూతన ఐటీడీఏ ఏర్పాటు.
పలాస : రహదారుల విస్తరణ - పర్యాటకం..
పలాస ఆర్వోబీ నుంచి కోసంగిపురం వరకు 4 లేన్ల రోడ్డుకు రూ.16 కోట్లు, హరిపురం-మందస డబుల్ రోడ్డుకు రూ.16.50 కోట్లు. లొట్టూరు వద్ద వరహాలగెడ్డ (రూ.1.50కోట్లు), డబార్సింగి రిజర్వాయర్(రూ. 3 కోట్లు) పునరుద్ధరణ నిధులకు వినతి.
అక్కుపల్లి బీచ్ పర్యాటకాభివృద్ధి(పీపీపీ). జీడిపంట ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కోసం సెరికల్చర్ నుంచి హార్టికల్చర్‌కు భూమి బదిలీ. మెండు అటవీ ప్రాంతంలోని 250 ఎకరాల నోటిఫైడ్ భూమిని అభివృద్ధి పనులకు వినియోగించుకునేలా అనుమతులు.
నరసన్నపేట : డీపీఎన్ కారిడార్-ఎత్తిపోతలు..
మూలపేట పోర్టు కనెక్టివిటీ కోసం నరసన్నపేట- గరిముకుందపురం- ఇచ్ఛాపురం(డీపీఎన్) రోడ్డును రూ.330 కోట్లతో 4 లేన్లుగా విస్తరించాలని వినతి. బొంతు- సారవకోట- కొత్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ పనులకు రూ. 180.22 కోట్లు, కామేశ్వరరావుపేట-దేవాది ఎత్తిపోతలకు రూ.56.28కోట్లు, వంశధార ఎడమ కాలువ(ఎల్‌ఎంసీ) మెరుగుదలకు రూ.9కోట్లు, రాజులచెరువు సుందరీకరణకు రూ. 5 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదన.
ఇరిగేషన్ షట్టర్లపై ఉన్న కోర్టు కేసుల సత్వర పరిష్కారం, తామరాపల్లి వద్ద ఉన్న 23.78 ఎకరాల్లో చేనేత క్లస్టర్ ఏర్పాటు.
టెక్కలి : ఇండస్ట్రీయల్ కారిడార్‌తో ఉపాధి ..
మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే భావనపాడు క్రీక్ అభివృద్ధికి రూ. 70 కోట్లు, వంశధార ఎడమ కాలువ మెరుగుదలకు రూ. 19.17 కోట్లు మంజూరు చేయాలని వినతి. నందిగాం సీతాసాగరం, టెక్కలి మదనగోపాల సాగరం, దాలి చెరువుల పునరుద్ధరణకు రూ. 37.33 కోట్ల అంచనాతో ప్రతిపాదన.
మూలపేట పోర్టుకు ఆనుకుని కేంద్రం (డీపీఐఐటీ) పరిధిలో ఉన్న 4,500 ఎకరాల ఉప్పు భూములను భారీ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కోసం రాష్ట్ర ఏపీఐఐసీకి బదిలీ చేయించేలా సీఎంను కోరనున్నారు.
ఎచ్చెర్ల : తాగునీరు.. స్కిల్ డెవలప్‌మెంట్..
కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న 63 పంచాయతీల దాహార్తి తీర్చేందుకు నారాయణ సాగరం మినీ రిజర్వాయర్‌కు కేంద్రం నుంచి నిధులు సాధించేలా వినతి. మడ్డువలస స్టేజ్-2 భూసేకరణకు రూ. 6 కోట్లు, తోటపల్లి బ్యారేజీ ఫేజ్-2 కు రూ. 3.35 కోట్లు, రణస్థలం సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు రూ. 33.70 కోట్ల అంచనాతో ప్రతిపాదన.
స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా రణస్థలంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు. మధుపాం గ్రామానికి నూతన సచివాలయ మంజూరు.
ఇచ్ఛాపురం : బ్రిటిష్ కాలం నాటి వంతెన పునర్నిర్మాణం ..
2023లో కూలిన బహుదా వంతెన పునర్నిర్మాణానికి రూ.23 కోట్లు మంజూరు చేయాలి. బహుదా నదిపై 11 ఓపెన్‌హెడ్ ఛానల్స్ మెరుగుదలకు రూ.21కోట్లు, గంగాసాగర్ మినీ రిజర్వాయర్ పంపిణీ వ్యవస్థకు రూ. 2కోట్లు. ఉద్దానం రైతుల కోసం రూ.50 కోట్ల అంచనాతో కొబ్బరి (కోకోనట్) పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన.
బారువ బీచ్ అభివృద్ధికి పీపీపీ విధానం. సరిహద్దుల్లోని ఒరియా మాతృభాష పాఠశాలల కోసం ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం, పుస్తకాల ముద్రణకు ప్రభుత్వ అనుమతి కోరనున్నారు.