Share News

టైటానియం హబ్‌గా సిక్కోలు తీరం

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:33 AM

జిల్లాలోని సముద్ర తీరం అత్యంత అరుదైన, విలువైన ఖనిజాలకు కేంద్రంగా మారబోతోంది.

టైటానియం హబ్‌గా సిక్కోలు తీరం

-జిల్లాలో వేలాది హెక్టార్లలో అరుదైన ఖనిజ నిల్వలు గుర్తింపు

- విదేశీ దిగుమతులకు చెక్‌

- స్థానికంగానే భారీ పరిశ్రమలు

- గారలో ‘పీడీవో’గా అదానీ గ్రూప్‌ సంస్థ ఎంపిక

శ్రీకాకుళం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సముద్ర తీరం అత్యంత అరుదైన, విలువైన ఖనిజాలకు కేంద్రంగా మారబోతోంది. ఇప్పటిదాకా విదేశాలపై ఆధారపడుతున్న టైటానియం పిగ్మెంట్‌ మెటల్స్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. అందుకు ఆంధ్రప్రదేశ్‌ అనువైన ప్రాంతమని గుర్తించింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. కేవలం ఖనిజాన్ని తవ్వి తీసుకెళ్లడం కాకుండా, స్థానికంగానే శుద్ధీకరణకు ముందుకొచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తోంది. ఏపీ టైటానియం అండ్‌ స్ట్రాటజిక్‌ మెటీరియల్‌ మిషన్‌ (ఏపీ-టీఎస్‌ఎంఎం)కు సాంకేతిక, ఆర్థిక సహకారం అందించేందుకు ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌ ముందుకు వచ్చింది.

తీరమంతా సిరులే...

శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు సముద్ర తీరంలో 16 చోట్ల బీచ్‌ శాండ్‌ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో అత్యధిక శాతం మన జిల్లాలోనే ఉండడం గమనార్హం. జిల్లాలోని భావనపాడు, సంతబొమ్మాళి, గార, ఎచ్చెర్ల, రణస్థలం పరిధిలో వేలాది హెక్టార్ల తీర ప్రాంతంలో ఖనిజ నిల్వలు ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా గారలో అత్యధికంగా హెవీ మినరల్స్‌ (బీచ్‌శాండ్‌ మినరల్స్‌) 20 శాతం వరకు ఉన్నాయని తేలింది. ఈ బీచ్‌శాండ్‌లో టైటానియం మెటల్‌ తయారీకి వాడే ఇలిమినైట్‌, రూటైల్‌, సిలిమినైట్‌ ఖనిజాలతో పాటు అణుధార్మికత కలిగిన మోనజైట్‌ కూడా ఉంటుంది.

జిల్లాలో ఖనిజ నిల్వలు ఉన్న ప్రాంతాలివే (హెక్టార్లలో):

భావనపాడులో 1,788

సంతబొమ్మాళిలో 1,539

ఎచ్చెర్లలో 804

ఎచ్చెర్ల-రణస్థలంలో కలిపి 688

గారలో 347

టైటానియం తయారీకి ఉపయోగించే ఇలిమినైట్‌ నిల్వలు భావనపాడు లీజులో 10.21 మిలియన్‌ టన్నులు, సంతబొమ్మాళిలో 5.76 మిలియన్‌ టన్నుల చొప్పున ఉన్నట్లు గుర్తించారు. అలాగే అరుదైన మోనజైట్‌ నిల్వలు భావనపాడులో 0.18 మిలియన్‌ టన్నుల చొప్పున ఉన్నట్లు వెల్లడైంది.

అదానీ సంస్థకు బాధ్యతలు..

బీచ్‌శాండ్‌ లీజును ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పేరిట కేంద్ర గనుల శాఖ కేటాయిస్తుంది. ఖనిజాలు తవ్వి, వాటినుంచి ఇలిమినైట్‌, రూటైల్‌, సిలిమినైట్‌, మోనజైట్‌ వంటివి వేరు చేసేందుకు ప్రైవేటు సంస్థలను ‘ప్రాజెక్ట్‌ డెవలపర్‌ అండ్‌ ఆపరేటర్‌ (పీడీవో)’ పేరుతో ఎంపిక చేస్తుంది. జిల్లాకు సంబంధించి గార మండలంలో రెండుచోట్ల కలిపి 909.85 హెక్టార్లు, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో 90.15 హెక్టార్లు కలిపి మొత్తం వెయ్యి హెక్టార్లలో మూడు లీజులకు పీడీవోగా ఆదానీకి చెందిన ‘అల్యూవియల్‌ హెవీ మినరల్స్‌ లిమిటెడ్‌’ ఎంపికైంది. టెండర్‌లో అత్యధిక వాటా కోట్‌ చేసిన వారినే పీడీవోగా ఎంపిక చేస్తారు.

స్థానింగానే ఉపాధి

ఏపీ టైటానియం అండ్‌ స్ట్రాటజిక్‌ మెటీరియల్‌ మిషన్‌లో భాగంగా రూపొందిస్తున్న పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలను చేర్చింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లభించాల్సి ఉంది. బీచ్‌శాండ్‌ నుంచి వేరుచేస్తే వచ్చే ఖనిజాలకు మార్కెట్‌ విలువలో కనీసం 10 శాతం ఏపీఎండీసీకి ఇవ్వాలన్నది నిబంధన. టైటానియం మెటల్‌ తయారీకి వాడే ఇలిమినైట్‌, రూటైల్‌, సిలిమినైట్‌ ఖనిజాల్లో సగం తప్పకుండా శుద్ధిచేసి, వాటికి విలువ జోడించాల్సి ఉంటుంది. మిగిలిన సగం ఖనిజాలను దేశీయ కంపెనీలకు విక్రయించాలి. ఆ తర్వాతే విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఖనిజాలు వేరుచేయగా వచ్చే మోనజైట్‌ అణుధార్మికత కలిగి ఉంటుంది కాబట్టి, దీన్ని పూర్తిగా ఏపీఎండీసీ తీసుకుంటుంది. మోనజైట్‌ను ప్రైవేటు సంస్థల ద్వారా శుద్ధి చేయించి, విలువ జోడించి రేర్‌ ఎర్త్‌ ఆక్సైడ్‌ తయారు చేస్తారు. ఈ నూతన నిబంధనల వల్ల శ్రీకాకుళం తీర ప్రాంతంలో మినరల్‌ సెపరేషన్‌, శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. తద్వారా స్థానికంగా పరిశ్రమలు అభివృద్ధి చెంది, యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Updated Date - Jul 08 , 2026 | 12:33 AM