Share News

ఆక్వాహబ్‌గా సిక్కోలు

ABN , Publish Date - May 03 , 2026 | 12:06 AM

Aquahub Devolopment జిల్లాను ఆక్వాహబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. శనివారం సోంపేట మండలం మూలపాలెంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉదయ్‌ ఆక్వా పరిశ్రమను ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి ఆయన పరిశీలించారు.

ఆక్వాహబ్‌గా సిక్కోలు
ఆక్వా పరిశ్రమ నిర్వాహకులు, మత్స్యకారులతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

సోంపేట రూరల్‌, మే 2(ఆంధ్రజ్యోతి): జిల్లాను ఆక్వాహబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. శనివారం సోంపేట మండలం మూలపాలెంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉదయ్‌ ఆక్వా పరిశ్రమను ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, చేపలు, రొయ్యలు, పీతల పెంపకంలో విధి విధానాలను తెలుసుకున్నారు. జిల్లాను ఆక్వాహబ్‌గా తయారు చేసే దిశగా కార్యాచరణ ప్రారంభించామని కేంద్రమంత్రి తెలిపారు. జిల్లాలో మత్స్య సంపదను సరైన రీతిలో వినియోగించుకుంటే విశేష ఆదాయం, ఉపాధి పొందే వీలుందన్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి తోడ్పాటు ఇస్తాయని మత్స్యకారులకు హామీ ఇచ్చారు.

సముద్రంలోకి తాబేళ్ల పిల్లలు

ఆలివ్‌రిడ్లే తాబేళ్ల సంరక్షణలో భాగంగా శనివారం బట్టిగళ్లూరు వద్ద సముద్రంలోకి 820 తాబేళ్ల పిల్లలను కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌ విడిచిపెట్టారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ‘ఈ ఏడాది 1.2 లక్షల గుడ్లను సేకరించి పొదిగించాం. 45 నుంచి 50 రోజుల తర్వాత పొదిగిన పిల్లలకు సురక్షితంగా సముద్రంలోకి వదులుతున్నాం. సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడడం మనందరి బాధ్యత’ అని కేంద్రమంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, జనసేన ఇచ్ఛాపురం ఇన్‌చార్జి దాసరి రాజు, అటవీశాఖ అధికారులు, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2026 | 12:06 AM