లాజిస్టిక్ హబ్‌గా సిక్కోలు
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:19 AM
Solution to flood problem at Peddapadu Highway జిల్లాను లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చేసేలా చర్యలు చేపడుతున్నామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం పెద్దపాడు జాతీయ రహదారి వద్ద కల్వర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
పెద్దపాడు హైవే వద్ద వరద సమస్యకు శాశ్వత పరిష్కారం
కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
పాత శ్రీకాకుళం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): జిల్లాను లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చేసేలా చర్యలు చేపడుతున్నామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం పెద్దపాడు జాతీయ రహదారి వద్ద కల్వర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కల్వర్టును రెండు నెలల్లో పూర్తిచేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. ‘పెద్దపాడు జాతీయ రహదారి వద్ద కల్వర్లు లేకపోవడంతో వర్షాకాలంలో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను కేంద్ర రవాణాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. శాశ్వత పరిష్కారం దిశగా కల్వర్టు నిర్మాణానికి రూ.4.64 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రెండు నెలల్లో పనులు పూర్తిచేస్తాం. నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారిని ఆరులేన్లుగా విస్తరణ చేస్తాం. గురజాడ కళాశాల వద్ద మాదిరి ప్రజల అవసరాల మేరకు జాతీయ రహదారులపై మరో ఐదుచోట్ల ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తాం. వాటికి ర్యాంప్‌లను అనుసంధానం చేస్తాం. నవభారత్ కూడలిలో ఫ్లైఓవర్ అవసరాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీకి వివరించాం. త్వరలోనే వాటికి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. నవభారత్, కొత్తరోడ్డు, పెద్దపాడు కూడళ్లలో సుందరీకరణ చేయనున్నాం. పోర్టు కనెక్టవిటీ పెంచితే.. రవాణా సౌకర్యాల మెరుగుపడనున్నాయి. ఐటీ సెక్టార్ జిల్లాకు సమీపంలో అభివృద్ధి చెందనుంద’ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇన్‌చార్జి ఆర్టీవో పీవీ గంగాధర్‌రావు, తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, కూటమి శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు.