Share News

పైసలిస్తేనే.. సంతకం!

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:13 AM

There has to be a commission for every file : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌- రిమ్స్‌)లో బిల్లుల ఆమోదానికి కమీషన్లు చెల్లించనిదే ఏ ఫైల్‌ కదలదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రికి సంబంధించి శానిటేషన్‌, సెక్యూరిటీ స్బిబంది జీతభత్యాల బిల్లులు, ఇలా ఏ ఫైల్‌పై సంతకం పెట్టాలన్నా ఆ అధికారిని ప్రసన్నం చేసుకోనిదే.. పని జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

పైసలిస్తేనే.. సంతకం!

  • ప్రతి ఫైల్‌కూ కమీషన్‌ ఉండాల్సిందే

  • పరికరాల కొనుగోళ్లలో చేతివాటం

  • జీజీహెచ్‌లో ఓ అధికారి తీరుపై విమర్శలు

  • అరసవల్లి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌- రిమ్స్‌)లో బిల్లుల ఆమోదానికి కమీషన్లు చెల్లించనిదే ఏ ఫైల్‌ కదలదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రికి సంబంధించి శానిటేషన్‌, సెక్యూరిటీ స్బిబంది జీతభత్యాల బిల్లులు, ఇలా ఏ ఫైల్‌పై సంతకం పెట్టాలన్నా ఆ అధికారిని ప్రసన్నం చేసుకోనిదే.. పని జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. లోకల్‌గా పలు పరికరాల కొనుగోళ్లలో చేతివాటం చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సర్జికల్‌ పరికరాలు, లెనిన్‌క్లాత్‌, స్టేషనరీ తదితరాలను సరఫరా చేసి, వాటి చెల్లింపుల కోసం ఎవరైనా సరే అతనిని ప్రసన్నం చేసుకోవాల్సిందేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఏసీలు, కంప్యూటర్లు, టీవీల కొనుగోలులో ఆ అధికారికి వాటా దక్కనిదే బిల్లులు ఓకే చేసే ప్రసక్తే లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీఎంఐడీసీ ద్వారా జరిగే డ్రెయిన్ల పనులు, రిపేర్లు, ఎలక్ర్టికల్‌ సామానుల సరఫరా వంటి విషయాల్లో కూడా అధికారులు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే. వైద్యాధికారులు, సిబ్బందిపై కూడా ఆజమాయిషీ చెలాయించేందుకు ప్రయత్నించడం గమనార్హం. ఆసుపత్రి అవసరాలకు అనుగుణంగా వైద్యులు, సిబ్బందితో కలిసి పనిచేస్తేనే ఆసుపత్రి అభివృద్ధి సాధ్యపడుతుంది. కానీ ఇక్కడ పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉండడంతో వైద్యులు కూడా ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  • సర్వేలో తక్కువ శాతం ఉన్నా...

  • ఆసుపత్రిలో వివిధ రకాల సేవలకు సంబంధించి ఐవీఆర్‌ఎస్‌ (ప్రభుత్వ సర్వే) ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేస్తారు. ఒక వ్యక్తి ఓపీలో తన పేరు నమోదు చేసుకుంటే, అతనికి సేవల విషయమై కనీసం నాలుగు ఫోన్లు వస్తాయి. సేవలెలా ఉన్నాయి...అని సర్వే నిర్వహించి, రోగుల అభిప్రాయాలను నమోదు చేస్తారు. అయితే ఆసుపత్రి సేవల విషయానికి వస్తే వైద్యుల అందుబాటు, మందులు మొదలైన విషయాల్లో సర్వే రిపోర్టులు సంతృప్తి స్థాయిని సూచిస్తున్నాయి. కానీ శానిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వ సర్వే 50 నుండి 60 శాతం మఽధ్యలో నమోదవుతున్నా సరే.. అంతా బాగున్నట్లు ఆ అధికారి రిపోర్టు ఇస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైందో ఉన్నతాధికారులకు కూడా తెలియడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. పరిస్థితులను చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు.

  • ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సౌమిని వద్ద ప్రస్తావించగా.. ‘జీజీహెచ్‌లో అక్రమాలు జరిగిన విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై పరిశీలిస్తాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.

Updated Date - Aug 13 , 2026 | 12:13 AM