‘ట్రిపుల్ ఐటీ’లో సిక్కోలు సత్తా
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:03 AM
366 candidates selected for IIIT రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ఏపీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల్లో 2026-27 విద్యా సంవత్సరానికిగానూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ప్రొవిజినల్(తాత్కాలిక) ఎంపిక జాబితా విడుదలైంది.
తాత్కాలిక జాబితా విడుదల
జిల్లా నుంచి 366 మంది ఎంపిక
రాష్ట్రంలోనే అత్యధికం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ప్రాధాన్యం
23, 24 తేదీల్లో శ్రీకాకుళం క్యాంపస్‌లో కౌన్సెలింగ్
జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం
శ్రీకాకుళం/ ఎచ్చెర్ల, జూన్ 13(ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ఏపీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల్లో 2026-27 విద్యా సంవత్సరానికిగానూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ప్రొవిజినల్(తాత్కాలిక) ఎంపిక జాబితా విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం ఈ జాబితాను విడుదల చేశారు. ఈ ప్రవేశాల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు సాధించి సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో మొత్తం 44,104 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు 25,406 మంది, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 17,798 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 900 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సాధారణ సీట్లు 3,640, ఈడబ్ల్యూఎస్ 400 సీట్లు.. మొత్తం 4,040 సీట్లకు ప్రొవిజనల్ ఎంపిక జాబితాను విడుదల చేశారు. అత్యధికంగా జిల్లా నుంచి 366 మంది (9.06శాతం) విద్యార్థులు సీట్లు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఇందులో 165 మంది విద్యార్థులు సొంత జిల్లాలోని శ్రీకాకుళం క్యాంపస్(ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం)కు ఎంపికయ్యారు. 114 మంది నూజివీడు క్యాంపస్‌కు, 41 మంది ఆర్.కె.వ్యాలీకి, 46 మంది ఒంగోలు క్యాంపస్‌కు ఎంపికయ్యారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు అన్ని జిల్లాల నుంచి మొత్తం 1,010 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో 951 మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి రాగా, కేవలం 59 మంది మాత్రమే ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. ఎంపికైనవారిలో బాలురు 294 మంది కాగా, బాలికలు ఏకంగా 716 మంది ఉన్నారు. ఇక్కడ సీట్లు పొందిన విద్యార్థులకు ఇదే క్యాంపస్‌లో ఈ నెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రవేశాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 9552300009 వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నంబర్‌ను సంప్రదించవచ్చు.
అలాగే ఈ నెల 19, 20 తేదీల్లో నూజివీడు, ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌ల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఒంగోలు క్యాంపస్‌లో కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ ఎంపిక ప్రొవిజనల్ మాత్రమేనని, అసలు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మాత్రమే ప్రవేశం ఖరారు అవుతుందని ఆర్జీయూకేటీ అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సంబంధిత కౌన్సెలింగ్ కేంద్రాలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
గ్రామీణ విద్యార్థులకే పెద్దపీట
రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన మొత్తం 4,040 మందిలో 3,907 మంది (96.7 శాతం) ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే కావడం విశేషం. ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి కేవలం 133 మంది విద్యార్థులు (3.3 శాతం) మాత్రమే ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థుల్లో 2855 మంది (70.66 శాతం) బాలికలు, 1185 మంది (29.33) మంది బాలురు ఉన్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు జడ్పీ గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన బవిరెడ్డి దివ్యతేజ 596 మార్కులు సాధించి ఎంపికైన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గ్రామీణస్థాయిలోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలన్న ఆర్జీయూకేటీ లక్ష్యం నెరవేరుతోందని మంత్రి నారా లోకేశ్ తన ట్వీట్‌లో హర్షం వ్యక్తం చేశారు.