టీడీపీ నాయకుడిపై ఎస్‌ఐ దాడి
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:39 AM
Attack at a polling station in Telikipenta సరుబుజ్జిలి మండలం తెలికిపెంట గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి నందివాడ రాజ్యలక్ష్మి భర్త, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నందివాడ గోవిందరావుపై మొబైల్ పార్టీ ఎస్‌ఐ రాము లాఠీతో దాడి చేశారు. గోవిందరావు తలకు, చేతి వేలకు గాయాలు కావడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఎస్‌ఐపై తిరగబడడంతో పోలీసులు ఆయన్ను వాహనంలోకి ఎక్కించారు. ఈ వాహనం కదలకుండా గ్రామస్థులు రెండు గంటలపాటు నిర్బంధించారు.
తలకు, చేతివేళ్లకు గాయాలు
తెలికిపెంటలో పోలింగ్ కేంద్రం వద్ద ఘటన
గ్రామస్థులు, మహిళల ఆగ్రహం
ఎస్‌ఐ వాహనం కదలకుండా నిర్బంధం
ఎస్పీ హామీతో శాంతించిన వైనం
సరుబుజ్జిలి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సరుబుజ్జిలి మండలం తెలికిపెంట గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి నందివాడ రాజ్యలక్ష్మి భర్త, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నందివాడ గోవిందరావుపై మొబైల్ పార్టీ ఎస్‌ఐ రాము లాఠీతో దాడి చేశారు. గోవిందరావు తలకు, చేతి వేలకు గాయాలు కావడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఎస్‌ఐపై తిరగబడడంతో పోలీసులు ఆయన్ను వాహనంలోకి ఎక్కించారు. ఈ వాహనం కదలకుండా గ్రామస్థులు రెండు గంటలపాటు నిర్బంధించారు. చివరకు ఎస్పీ హామీతో వారంతా శాంతించారు.
ఏం జరిగిందంటే..
తెలికిపెంటలో ఆదివారం ఉదయం 7 గంటలకు ఎన్నికల సిబ్బంది పోలింగ్ ప్రారంభించారు. నిబంధనల మేరకు ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ కేంద్రానికి సమీపంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నందివాడ గోవిందరావు తమ శిబిరం సమీపంలో నిల్చొని ఉండగా మొబైల్ పార్టీ పోలీసులు తెలికిపెంటకు చేరుకున్నారు. మొబైల్ పార్టీ ఎస్‌ఐ రాము.. గోవిందరావుతో వాగ్వాదానికి దిగారు. క్షణికావేశంలో తన వద్ద ఉన్న లాఠీతో విచక్షణారహితంగా దాడి చేయడంతో గోవిందరావు తలపై, చేతివేల మధ్య గాయాలయ్యాయి. తమ నాయకుడిపై ఎస్‌ఐ అకారణంగా దాడి చేశారంటూ గ్రామానికి చెందిన యువత, మహిళలు ఆగ్రహంతో ఎస్‌ఐపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు ఎస్‌ఐను మొబైల్ పార్టీ వాహనంలోకి వెక్కించి అద్దాలను మూసివేశారు. ప్రత్యేక బలగాలు అక్కడకు చేరుకొని ఎస్‌ఐ రాము ఉన్న వాహనానికి వలయంగా ఏర్పడ్డారు. అయినప్పటికీ గ్రామస్థులు శాంతించకుండా వాహనాన్ని రెండు గంటలపాటు కదలనీయకుండా అడ్డుకున్నారు. ఒక దశలో వాహనంపై దాడి చేసి ఎస్‌ఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు శాపనార్థాలు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం డీఎస్పీ ధనుంజయనాయుడు తెలికిపెంటకు చేరుకొని గ్రామస్థులతో చర్చలు జరిపినా వారు ససేమిరా అంటూ భీష్మించుకున్నారు.
గోవిందరావుతో మాట్లాడిన ఎస్పీ
ఎస్‌ఐను తమకు అప్పగించాలని, లేకపోతే గుణపాఠం చెబుతామని మహిళలు పట్టువీడకపోవడంతో డీఎస్పీ.. ఎస్పీ మహేశ్వరరెడ్డిని ఫోన్‌లో సంప్రదించారు. ఈ మేరకు ఎస్పీ బాధితుడు గోవిందరావుతో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపి ఎస్‌ఐ రాముపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గోవిందరావు నచ్చజెప్పడంతో గ్రామస్థులు శాంతించారు. అనంతరం ఎస్‌ఐ ఉన్న వాహనాన్ని పోలీస్ రక్షణ మధ్య గ్రామం దాటించారు. కాగా, ఎస్‌ఐ రాముపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. తక్షణమే ఆయన్ను ఎన్నికల విధుల నుంచి రిలీవ్ చేసినట్టు ప్రకటించారు.
ఎమ్మెల్యే రవికుమార్ పరామర్శ
గాయపడిన గోవిందరావును రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ పరామర్శించారు. ఆయన్ను తన కారులో సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్య క్రేందానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఎస్‌ఐ రాము దురుసు ప్రవర్తన అమానుసమని, తక్షణమే జిల్లా అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.