అంతంత‘మాత్ర’మే!
ABN , Publish Date - Feb 21 , 2026 | 11:36 PM
Medicines Shortage at government hospital టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలో రోగులకు అరకొరగానే మందులు సరఫరా చేస్తున్నారు. 200 పడకలు ఉన్న ఈ ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతోంది.
టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలో మందుల కొరత
సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి అరకొరగా సరఫరా
పెరిగిన రోగుల సంఖ్యకు తగ్గట్లు కేటాయించని బడ్జెట్
టెక్కలి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలో రోగులకు అరకొరగానే మందులు సరఫరా చేస్తున్నారు. 200 పడకలు ఉన్న ఈ ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతోంది. గతంలో ఓపీ సంఖ్య 600 ఉండగా.. ప్రస్తుతం రోజుకు సుమారు 1,200 నుంచి 1,600 మంది వరకు ఔట్‌పేషెంట్లు వస్తున్నారు. గతంలో వంద పడకలు ఉన్న ఈ ఆస్పత్రికి మంత్రి అచ్చెన్నాయుడు.. 200 పడకల జిల్లా కేంద్ర ఆసుపత్రిగా అప్‌గ్రెడేషన్ చేయించారు. మెరుగైన సేవలు అందేలా సరిపడా వైద్యుల పోస్టులన్నీ భర్తీ చేయించారు. కాగా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి మాత్రం వందపడకల ఆసుపత్రికి ఇచ్చే మందులే సరఫరా చేస్తున్నారు. జిల్లా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి 200 పడకల స్థాయిలో మందులు సరఫరా జరగడం లేదు. సుమారు 512 రకాల మందులు ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, జనరల్ సర్జరీ వంటి విభాగాలకు, ల్యాబ్ పరీక్షలకు అవసరమైన మందులు, కెమికల్స్ అరకొరగా పంపిస్తుండడంతో వైద్యులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. షుగర్, బీపీ, కిడ్నీ, పెరాలసిస్, టీబీ రోగులకు కూడా మందులు సక్రమంగా అందడం లేదు. ఒక్కోసారి రోగుల అవసరాలను బట్టి స్థానికంగా కొనుగోలు చేయడం, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మిగిలి ఉన్న మందులను తెచ్చి సర్దుబాటు చేస్తున్నారు.
మందుల బడ్జెట్ ఇలా..
2025-26 సంవత్సరంలో టెక్కలిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి మొదటి క్వార్టర్ రూ.19,94,175, రెండో క్వార్టర్ రూ.32,50,965, మూడో క్వార్టర్ 12.78 లక్షలు, నాల్గవ క్వార్టర్ 19.21 లక్షలు మొత్తంగా రూ.84,44,140 మందులకు కేటాయించారు.
సర్జికల్ విభాగానికి సంబంధించి మొదటి క్వార్టర్ రూ.6,33,680, రెండో క్వార్టర్ రూ.8,13,550, మూడో క్వార్టర్ రూ.4,25,680, నాల్గవ క్వార్టర్ రూ.5,47,200 మొత్తంగా రూ.24,20,110 కేటాయించారు.
ల్యాబ్ మెటీరియల్‌కు సంబంధించి మొదటి క్వార్టర్ రూ.2,39,535, రెండో క్వార్టర్ రూ.2,69,865, మూడో క్వార్టర్ రూ.1.79 లక్షలు మొత్తంగా రూ.6,88,400 కేటాయించారు.
2024-25 సంవత్సరంతో పోల్చితే మందులకు రూ.4,67,439, సర్జికల్‌కు గాను రూ.9,94,150, ల్యాబ్‌కు సంబంధించి రూ.2,02,557 పెరిగింది. కాగా గతంలో కన్నా ఓపీ, ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరగడంతో ఈ బడ్జెట్ కేటాయింపులు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ మరింత పెంచాలని, పూర్తిస్థాయిలో మందులు సరఫరా చేయాలని రోగులు కోరుతున్నారు.
ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ బి.సూర్యారావు వద్ద ప్రస్తావించగా రోగుల అవసరాన్ని బట్టి కొన్ని మందులు స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఒక్కోసారి ఇతర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అదనపు మందుల్ని తెప్పించి రోగులకు సరఫరా చేస్తున్నామన్నారు.