అరకొరే!
ABN , Publish Date - Nov 21 , 2026 | 10:55 PM
No groundnut seeds జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌లో రైతులకు వేరుశనగ విత్తనాల కొరత వెంటాడుతోంది. సుమారు 15వేల ఎకరాల్లో వేరుశనగ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. కానీ వ్యవసాయశాఖ అధికారులు అందుకు సరిపడా విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో వేరుశనగ విత్తనాల కొరత
1,500 క్వింటాళ్లు మాత్రమే సిద్ధం
మట్టినమూనాలు సేకరించినచోట పంపిణీకి సన్నాహాలు
వ్యవసాయాధికారుల తీరుపై రైతుల మండిపాటు
టెక్కలి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి):
టెక్కలి మండలంలో 27 పంచాయతీలు ఉన్నాయి. చాలామంది రైతులు వేరుశనగ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా.. వ్యవసాయశాఖ అధికారులు చాకిపల్లి, అక్కవరం, తిర్లంగి, రావివలస, పోలవరం, భగవాన్‌పురం పంచాయతీల పరిధిలో మాత్రమే మట్టినమూనాలు సేకరించి.. వేరుశనగ విత్తనాల సరఫరాకు సిద్ధమయ్యారు. మిగిలిన పంచాయతీల్లో రైతులు వేరుశనగ విత్తనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌లో రైతులకు వేరుశనగ విత్తనాల కొరత వెంటాడుతోంది. సుమారు 15వేల ఎకరాల్లో వేరుశనగ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. కానీ వ్యవసాయశాఖ అధికారులు అందుకు సరిపడా విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్ స్కీమ్(ఎన్‌ఎంఈవో) కింద న్యూఢిల్లీ నుంచి 1,500 క్వింటాళ్ల విశిష్ట రకం వేరుశనగ విత్తనాలను జిల్లా వ్యవసాయశాఖ తెప్పించింది. ఇవి కిలో రూ.125 కాగా.. సబ్సిడీ కింద రైతులకు రూ.51కు అందించనుంది. వ్యవసాయశాఖ మట్టినమూనా పరీక్షలు నిర్వహించిన రైతులకు మాత్రమే ఈ రకం విత్తనాలు సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవి కేవలం 2,500 ఎకరాలకు మాత్రమే సరిపోనున్నాయి. దీంతో మిగిలిన రైతులు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
గతేడాది క్లస్టర్ వ్యాల్యూ చైన్ ఆయిల్ సీడ్స్ కింద వేరుశనగ విత్తనాలను కొంతమేరకు వ్యవసాయశాఖ అధికారులు సరఫరా చేశారు. అవి కూడా ప్రజాప్రతినిధులు ఉన్న ప్రాంతాలకు మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన రైతులు వేరుశనగ విత్తనాల కోసం నానా యాతన పడ్డారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ పంట తగ్గుముఖం పట్టడంతో విత్తన కొరత ఏర్పడింది. ప్రైవేట్ డీలర్లు దగ్గర కూడా వేరుశనగ విత్తనాలు లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో వేరుశనగ విత్తనాల పంపిణీకి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
మరో 1,500 క్వింటాళ్లు
ప్రస్తుతం జిల్లాకు ఎన్‌ఎంఈవో పథకం కింద 1,500 క్వింటాళ్ల విశిష్ఠ రకం విత్తనాలు చేరాయి. ఇప్పుడు మరో 1,500 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు రావాల్సి ఉంది. రైతులు పండించే వాటితో కొంతమేరకు విత్తనాలు సమకూర్చుకోవడం ద్వారా కొరత నివారించుకోచ్చు.
- వైవీ మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి