సిక్కోలు.. శోభాయమానం
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:48 AM
Rathasapthami celebrations రథసప్తమి వేడుకల వేళ.. సిక్కోలు శోభాయమానంతో కళకళలాడుతోంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళంలో నిర్వహించిన రథసప్తమి శోభాయాత్ర కనులపండువగా సాగింది.
వైభవంగా రథసప్తమి శోభాయాత్ర
ఆకట్టుకున్న కళారూపాల ప్రదర్శన
శ్రీకాకుళం/ అరసవల్లి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రథసప్తమి వేడుకల వేళ.. సిక్కోలు శోభాయమానంతో కళకళలాడుతోంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళంలో నిర్వహించిన రథసప్తమి శోభాయాత్ర కనులపండువగా సాగింది. కేఆర్ స్టేడియం వద్ద రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొని.. సంప్రదాయ డప్పులు కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టారు. 55 రకాలకుపైగా జానపద, సంప్రదాయ కళారూపాలు, వివిధ క్షేత్రాల దైవ శకటాలు, శంఖారావాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన యాత్రలో సూర్యరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం, అన్నవరం, విజయవాడ వంటి ప్రముఖ క్షేత్రాల నమూనా శకటాలు భక్తులను మంత్రముగ్దులను చేశాయి. మహిళల కర్రసాము, అఘోరాల వేషధారణలు, కేరళ డ్రమ్స్, థింసా నృత్యాలు.. యాత్రకు వన్నె తెచ్చాయి. డేఅండ్‌నైట్ జంక్షన్ నుంచి ఏడురోడ్ల కూడలి, సూర్యమహల్, మిల్ జంక్షన్ మీదుగా అరసవల్లి ఆలయం వరకు సాగిన ఈ యాత్రను తిలకించేందుకు భక్తజనం పోటెత్తారు. కళాకారులను ఉత్సాహపరిచారు. యాత్ర ఆద్యంతం క్రమశిక్షణతో సాగేలా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర జిల్లా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. యాత్ర పొడవునా భక్తులకు స్వచ్ఛంద సంస్థలు తాగునీరు, ప్రసాదం వితరణ చేపట్టాయి. రాత్రి వేళ విద్యుత్ దీపాల కాంతుల్లో కళారూపాల ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.
నేటి అర్ధరాత్రి నుంచి ఆదిత్యుడి క్షీరాభిషేకం
అరసవల్లిలో ఆదిత్యుడి రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది వారం రోజుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన ఘట్టమైన క్షీరాభిషేకం శనివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 8 గంటల వరకు క్షీరాభిషేక సేవ నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం 4 గంటల వరకు ఆదిత్యుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం రాత్రి 11 గంటల వరకు ప్రత్యేక అలంకరణ సేవలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. 250 సీసీ కెమెరాలతో ప్రతీ కదలికను నిశితంగా పరిశీలించేలా చర్యలు చేపట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి క్షేత్రస్థాయిలో నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన, శీఘ్ర దర్శనం కల్పించనున్నామని కలెక్టర్ తెలిపారు.