నవంబరు నాటికి షిప్ రాకపోకలు
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:23 AM
Moolapet port works at a fast pace ‘మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రానున్న నవంబరు నాటికి షిప్ రాకపోకలు సాగించేలా చర్యలు చేపడుతున్నామ’ని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దర్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
శరవేగంగా మూలపేట పోర్టు పనులు
గత ప్రభుత్వ హయాంలో 20 శాతమే..
ప్రస్తుత కూటమి పాలనలో 74.65 శాతం పూర్తి
రాజకీయ ఉనికి కోసం వైసీపీ నాయకుల పాట్లు
మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు
టెక్కలి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ‘మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రానున్న నవంబరు నాటికి షిప్ రాకపోకలు సాగించేలా చర్యలు చేపడుతున్నామ’ని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దర్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పోర్టు నిర్మాణ పనుల విషయంలో రాజకీయ ఉనికి కోసం వైసీపీ నాయకులు పాట్లు పడుతున్నారని విమర్శించారు. సోమవారం సంతబొమ్మాళి మండలం మూలపేటలో పోర్టు పనులను వారు పరిశీలించారు. డ్రెజ్జర్‌షిప్‌ను, బెర్త్‌ల నిర్మాణం, నార్త్‌బ్రేక్, సౌత్‌బ్రేక్ నిర్మాణ పనులు, ట్రయిల్‌రన్ షిప్ అవకాశాలు తదితర వాటిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. మంత్రులు మాట్లాడుతూ ‘వైసీపీ హయాంలో పోర్టు పనులు 20శాతం పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 74.65 శాతం పనులు పూర్తి చేశాం. బ్రేక్‌వాటర్ పనులు 28.9శాతం గతంలో జరిగితే.. ప్రస్తుతం 92.38 శాతం పూర్తయ్యాయి. బెర్త్‌లు గతంలో 26శాతం పనులు జరగ్గా.. ప్రస్తుతం 77.83శాతం పూర్తి చేశాం. పోర్టు ఆర్థిక పురోభివృద్ధి అంశంలో వైసీపీ హయాంలో రూ.718కోట్లు పనులు చేపట్టగా.. ప్రస్తుతం రూ.1,883కోట్లు పనులు జరిగాయి. ఉప్పు భూముల సమస్యని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవతో 99ఏళ్లకు లీజ్ అగ్రిమెంట్ సాధించాం. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో రోడ్లు, కాలువలు, విద్యుత్, తాగునీటి సమస్యలు పరిష్కరించాం. ఆ ప్రాంతంలో సామాజిక మరుగుదొడ్లు, నౌపడా మూడురోడ్లు జంక్షన్ పరిధిలో ఫ్లైఓవర్ నిర్మించాలని అధికారులకు సూచించాం. రైలు, రోడ్డు కనెక్టివిటీలకు ఉన్న ఇబ్బందులు అధిగమించేలా చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలోనే మూలపేట ఆర్‌అండ్‌ఆర్ కాలనీ మోడల్ కాలనీగా తయారు చేస్తామ’ని తెలిపారు. శరవేగంగా పోర్టు అభివృద్ధి పనులు జరుగుతుండగా.. వైసీపీ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు నిస్సిగ్గుగా, అడ్డగోలుగా మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోర్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ దోమచర్ల సత్యనారాయణ, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏపీ మారిటైం సీఈవో అభిషేక్‌కుమార్, విశ్వసముద్ర డైరెక్టర్ మహేష్, జీఎం శంకరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు సుగ్గు స్వరూపరెడ్డి, జీరు భీమారావు, రెడ్డి అప్పన్న పాల్గొన్నారు.