Share News

ఆ నలుగురూ..!

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:19 AM

The shepherds are safe at Nagavali ఆ నలుగురు గొర్రెల కాపరులూ.. పొన్నాడ తీరం వద్ద వరదనీటిలో చిక్కుకున్నారు. చుట్టూ నీటి ప్రవాహం.. మధ్యలో లంక భూమి.. వరద మరింత ముంచెత్తితే ప్రాణాలకు ముప్పే. ఈ పరిస్థితుల్లో అధికారుల సమయస్ఫూర్తితో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఆ నలుగురూ..!
పొన్నాడ తీరంలో ఒడ్డుకు చేరిన గొర్రెల కాపరులతో అధికారులు, సిబ్బంది

నాగావళి లంకలో చిక్కుకున్న గొర్రెల కాపరులు

సురక్షితంగా కాపాడిన అధికారులు

ఎచ్చెర్ల, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆ నలుగురు గొర్రెల కాపరులూ.. పొన్నాడ తీరం వద్ద వరదనీటిలో చిక్కుకున్నారు. చుట్టూ నీటి ప్రవాహం.. మధ్యలో లంక భూమి.. వరద మరింత ముంచెత్తితే ప్రాణాలకు ముప్పే. ఈ పరిస్థితుల్లో అధికారుల సమయస్ఫూర్తితో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం పొన్నాడ సమీపంలోని నాగావళి లంక(కళ్లేపల్లి)లో చిక్కుకున్న నలుగురు గొర్రెల కాపరులను రెవెన్యూ, పోలీసు, ఫైర్‌ సిబ్బంది సాహసోపేతంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. సోడిముడి నాగరాజు(కనుగులవానిపేట), లడగల వెంకటరావు(కళ్లేపల్లి), పల్లా అప్పారావు (పొన్నాడ), ఆవాల గంగులు (పొందూరు) అనే గొర్రెల కాపరులు నాగావళి లంకలో చిక్కుకున్నట్టు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఎచ్చెర్ల, శ్రీకాకుళం తహసీల్దార్లు బి.గోపాల్‌, గణపతిరావు పొన్నాడ వద్దకు పరుగులు తీశారు. మరోవైపు అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేశారు. ఫైర్‌ సిబ్బంది రెస్క్యూ బోటుతో పొన్నాడకు చేరుకుని ప్రమాదకరమైన నీటి ఉధృతిని లెక్కచేయకుండా లంక వైపు దూసుకువెళ్లారు. అక్కడ ప్రాణభయంలో బిక్కుబిక్కుమంటున్న ఆ నలుగురినీ రక్షిత కవచాలతో బోట్లలో ఎక్కించుకుని సురక్షితంగా పొన్నాడ తీరానికి చేర్చారు. కాగా, లంకలో ఎత్తయిన ప్రాంతంలో 360 గొర్రెలు, 80 పిల్లలు సురక్షితంగానే ఉన్నాయని, వరద ఉధృతి తగ్గిన తర్వాత వాటిని ఒడ్డుకు చేర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.

Updated Date - Sep 26 , 2026 | 12:19 AM