Share News

జీవాలను రక్షించబోయి.. తానే బలై!

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:10 AM

Shepherd and 30 sheep die గొర్రెల పెంపకమే ఆయన జీవనాధారం. మేతకు తీసుకెళ్లిన గొర్రెల మంద.. రైలు వస్తున్న సమయంలో పట్టాలపైకి వెళ్లగా వాటిని రక్షించబోయాడు. ఈ క్రమంలో రైలు ఢీకొని ఆయన ప్రాణాలు కోల్పోయాడు. మరో 30 గొర్రెలు కూడా విగతజీవులుగా మారాయి.

జీవాలను రక్షించబోయి.. తానే బలై!
మృతిచెందిన గొర్రెల వద్ద విలపిస్తున్న తోటి కాపరి, ఇన్‌సెట్‌లో మృతుడు శనగల పోతయ్య (ఫైల్‌)

రైలు ఢీకొని గొర్రెలకాపరి మృతి

30 గొర్రెలు కూడా మృత్యువాత

పొందూరు/ జి.సిగడాం, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): గొర్రెల పెంపకమే ఆయన జీవనాధారం. మేతకు తీసుకెళ్లిన గొర్రెల మంద.. రైలు వస్తున్న సమయంలో పట్టాలపైకి వెళ్లగా వాటిని రక్షించబోయాడు. ఈ క్రమంలో రైలు ఢీకొని ఆయన ప్రాణాలు కోల్పోయాడు. మరో 30 గొర్రెలు కూడా విగతజీవులుగా మారాయి. ఈ ఘటనకు సంబంధించి రైల్వేపోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొందూరు మండలం రెడ్డిపేట (పుల్లాజీపేట) గ్రామానికి చెందిన శనగల పోతయ్య(47) రైలు ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటనలో ఈయనతోపాటు మరో 30 గొర్రెలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. పోతయ్య సుమారు నాలుగు దశాబ్దాలుగా గొర్రెల కాపరి వృత్తి కొనసాగిస్తున్నాడు. శనివారం గొర్రెల మందను జి.సిగడాం మండలం వాండ్రంగి రైల్వేగేటు వైపు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో గొర్రెలు రైలు పట్టాలపైకి వెళ్లాయి. అదే సమయంలో రైలు వస్తుండడంతో.. వాటిని కాపాడేందుకు పోతయ్య ప్రయత్నించాడు. పట్టాలపైకి వెళ్లి.. వాటిని బయటకు తోలుతుండగా.. అప్పటికే దూసుకొస్తున్న రైలు ఢీకొంది. దీంతో పోతయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. 30 గొర్రెలు కూడా విగతజీవులుగా మారాయి. దీంతో కుటుంబ సభ్యులు విలపించారు. పోతయ్యకు భార్య మంగమ్మ, ఇద్దరు కుమారులు సాయి, సింహాద్రి ఉన్నారు. ఒక కుమారుడు దివీస్‌ల్యాబ్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. మరొకడు డిగ్రీ చదువుతున్నాడు. పోతయ్య మృతి చెందిన విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. తమకు ఇక దిక్కెవరని విలపించారు. ఆమదాలవలస రైల్వేపోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోతయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.

Updated Date - Jun 21 , 2026 | 12:10 AM