Share News

శత్రుచర్ల కన్నుమూత

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:25 AM

Funeral for Shatrucharla today టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఈయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.

శత్రుచర్ల కన్నుమూత
శత్రుచర్ల విజయరామరాజు (ఫైల్‌)

ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా గెలుపు

ఎమ్మెల్సీ, రవాణా, అటవీ శాఖ మంత్రిగా విశేష సేవలు

ఉత్తరాంధ్ర టైగర్‌గా గుర్తింపు

నేడు అంత్యక్రియలు

కేంద్ర, రాష్ట్రమంత్రుల సంతాపం

మెళియాపుట్టి/పాతపట్నం/ కోటబొమ్మాళి/ శ్రీకాకుళం అర్బన్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఈయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 1948 ఆగస్టు 4న పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో శత్రుచర్ల జన్మించారు. 1978లో జనతాపార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. రాజకీయంలో అంచెలంచెలుగా ఎదిగి.. ఉత్తరాంధ్ర టైగర్‌గా, తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందారు.

1978-83 మధ్య జనతా పార్టీలో నుంచి నాగూరు నియోజకవర్గం(కురుపాం) ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తరువాత తన ప్రియ స్నేహితుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్‌ పార్టీలో అడుగు పెట్టారు.

1983-85, 1985-89లో నాగూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

1985-86లో ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడిగా పనిచేశారు.

1989-91లో పార్వతీపురం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.

1990లో అటవీ, పర్యావరణ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు.

1991-96లో పార్వతీపురం ఎంపీగా రెండోసారి గెలిచారు.

1998-99లో పార్వతీపురం ఎంపీగా మూడోసారి ఎన్నికయ్యారు.

2004-09 మధ్య కాలంలో పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో అటవీ, పర్యావరణ, సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు.

2009-14లో పార్వతీపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రవాణాశాఖ మంత్రిగా, 2010 నుంచి రెండోసారి అటవీ, పర్యావరణ, సాంకేతికశాఖ మంత్రిగా పనిచేశారు.

తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో టీడీపీ తరపున పాతపట్నం ఎమ్మెల్యేగా బరిలో నిలిచి ఓటమి చెందారు. కానీ, జిల్లాతో మాత్రం ఎనలేని బంధాన్ని కొనసాగించారు.

2017 నుంచి 2023 మధ్య కాలంలో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఏ పార్టీలో ఉన్నా పార్టీ విజయం కోసం ఒక కార్యకర్త వలే పని చేసేవారు. తన ప్రతీ సభలో మొదట ప్రజలందరికీ ‘మీ విజయరామరాజు విప్లవ జోహార్లు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించేవారు.

నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

మాజీ మంత్రి విజయరామరాజు మృతి తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు తీరని లోటని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు. ఈ మేరకు చినమేరంగిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

శత్రుచర్ల మృతిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ‘రాజకీయ ప్రస్థానంలో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శత్రుచర్ల విజయరామరాజు ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా పేరు పొందారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమ’ని తెలిపారు. అలాగే పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద రావు, మాజీఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి, మాజీ ఎంపీపీ సలాన మోహనరావు తదితరులు సంతాపం తెలిపారు.

Updated Date - Nov 13 , 2026 | 12:25 AM