Share News

పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు

ABN , Publish Date - Oct 22 , 2026 | 01:20 AM

జిల్లాలో శరన్నవరాత్రులు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. దసరా సందర్భంగా దుర్గాదేవి ఆలయాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కిటకిటలాడాయి.

పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు
దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న దృశ్యం

  • దసరా రోజున ఆలయాల్లో భక్తుల రద్దీ

  • రాజరాజేశ్వరీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

శ్రీకాకుళం కల్చరల్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శరన్నవరాత్రులు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. దసరా సందర్భంగా దుర్గాదేవి ఆలయాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కిటకిటలాడాయి. చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పాత శ్రీకాకుళంలోని సంతోషిమాత ఆలయంలో అర్చకుడు మోదుకూరి కిరణ్‌శర్మ వడిబియ్యం సమర్పించి పూర్ణాహుతి నిర్వహించారు. నగరంలోని పలు ఆలయాల్లో చండీయాగాలు నిర్వహించారు. కత్తెరవీధిలోని రాజరాజేశ్వరీ ఆలయంలో రఘుపాత్రుని శ్రీకాంత్‌ శిష్యబృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. పాలకొండ రోడ్డులోని విజయగణపతి ఆలయం వద్ద కొత్త వాహనాలకు పూజలు చేయించేందుకు ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. మొండేటివీధిలో లలితశివకామేశ్వరీ అమ్మవారికి 51 రకాల పిండివంటలు సమర్పించారు. నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రజలు దసరా పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

నాగావళి, పంటకాలువల్లో నిమజ్జనాలు

శరన్నవరాత్రులు ముగియడంతో నగరంలోని దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. కొందరు నిర్వాహకులు మంగళవారం నిమజ్జనం చేయగా, మరికొందరు బుధవారం నిర్వహించారు. అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లిన భక్తులు నాగావళి నది, పంటకాలువల్లో నిమజ్జనం చేశారు.

Updated Date - Oct 22 , 2026 | 01:20 AM