ఉక్కపోత.. గుండెకోత
ABN , Publish Date - May 23 , 2026 | 11:45 PM
Downed poles... no electricity or problems ఈదురుగాలుల ప్రభావంతో జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకూ విద్యుత్ సరఫరా లేక ఉక్కపోతతో అల్లాడిపోయారు.
ఈదురుగాలుల ప్రభావంతో తీవ్ర నష్టం
నేలకొరిగిన స్తంభాలు.. విద్యుత్ లేక ఇక్కట్లు
అరటి, బొప్పాయి, మామిడి పంటలకూ ముప్పు
బాణాంలో రేకులు తగిలి ఇద్దరికి తీవ్రగాయాలు
పొందూరు/ ఎచ్చెర్ల/ రణస్థలం, మే 23 (ఆంధ్రజ్యోతి): ఈదురుగాలుల ప్రభావంతో జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకూ విద్యుత్ సరఫరా లేక ఉక్కపోతతో అల్లాడిపోయారు. మరోవైపు అరటి, బొప్పాయి, మామిడి తదితర వాణిజ్య పంటలకు తీవ్రనష్టం వాటిల్లడంతో తమకు గుండెకోత తప్పలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం
పొందూరు మండలంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలుల ప్రభావంతో 80 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వాటిలో 30 స్తంభాలు పూర్తిగా విరిగిపోయాయి. పెనుబర్తి, కేశవదాసుపురం గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మోటార్లు పనిచేయక తాగునీటి కోసం బోరుబావుల వద్ద గంటల తరబడి నిరీక్షించారు. ఎచ్చెర్ల మండలంలో సుమారు 24 గంటల పాటు సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాధారణంగా వర్షం కురిస్తే రెండు, మూడు గంటల్లో విద్యుత్ సరఫరా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రాత్రి వరకు సరఫరా రాలేదు. చాలా చోట్ల శనివారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మోటార్లు పనిచేయక నీటి కోసం అవస్థలు పడ్డారు. ఇన్వెర్టర్ల చార్జింగ్ కూడా నాలుగైదు గంటల్లో ఆగిపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఇంటర్నెట్ పనిచేయక, సెల్‌ఫోన్ చార్జింగ్ కూడా లేక పాట్లు పడ్డారు. అలాగే రణస్థలం మండలంలో కూడా విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. 25 విద్యుత్ స్తంభాలు, 2 ట్రాన్స్‌ఫార్మర్లు పాడైనట్లు ఏపీ తిరుపతిరావు తెలిపారు.
నేలకొరిగిన పంటలు
ఈదురుగాలుల కారణంగా అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొందూరు మండలం బాణాం, తండ్యాం, దళ్లిపేట తదితర గ్రామాల్లో పదుల ఎకరాల్లో అరటి, బొప్పాయి పంటల నేలకొరిగాయని వాపోయారు. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో కూడా అరటి, మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రణస్థలంలో 471 ఎకరాల్లో అరటి, 27 ఎకరాల బొప్పాయి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని గుర్తించి.. తమకు పరిహారం అందజేయాలని రైతులు కోరారు.
స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కొండములగాం, బంటుపల్లి, కోష్ట, రణస్థలం, చిల్పపేటరాజం, నారువా గ్రామాల్లో పర్యటించారు. పంట నష్టాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తరపున రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా సమస్యలు పరిష్కరించాలని కోరారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
ఇద్దరికి గాయాలు
పొందూరు మండలం బాణాం గ్రామంలో ఈదురుగాలుల ప్రభావంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు దళ్ళి నారాయణ, దళ్ళి అప్పలనాయుడు ఆరుబయట కూర్చోగా, వారిపై ఓ షెడ్డు నుంచి రేకులు పడ్డాయి. గాయపడిన వారిద్దరినీ స్థానికులు పొందూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కిందస్థాయి సిబ్బంది తప్ప వైద్యులు లేరు. దీంతో రిమ్స్‌కు తరలించారు.
చిలకపాలెం-పొందూరు రహదారిలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఎస్‌ఐ వి.సత్యనారాయణ సిబ్బందితో అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించారు.
ట్రాన్స్‌కో డీఈఈ ఎస్.శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎచ్చెర్ల మండలంలో 35 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో 7 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోయాయి. 10 చోట్ల విద్యుత్ తీగలపై చెట్లు కూలిపోయాయి. 2 చోట్ల కట్టర్లు తెగిపోయాయి. ఈదురుగాలుల వల్ల రూ. 35 లక్షల వరకు నష్టం వాటిల్లింద’ని తెలిపారు.