శుభకార్యానికి బయలుదేరి...
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:33 AM
కొత్తగ్రహారం సమీప జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆనందపురం గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి కణితి లోచన మృతిచెందింది.
నందిగాం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): కొత్తగ్రహారం సమీప జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆనందపురం గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి కణితి లోచన మృతిచెందింది. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోచన మేనమామ, బోరుభద్ర గ్రామానికి చెందిన లక్ష్మీపతి, తన కుమార్తెతో పాటు మేనకోడలిని తీసుకొని పలాస మండలం నీలిభద్రలో శుభకార్యానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. లక్ష్మీపతికి నందిగాం తహసీల్దార్ కార్యాలయంలో పని ఉండడంతో కొత్తగ్రహారం సమీపంలో ఉన్న షాపు వద్ద పిల్లలను ఉంచారు. తిరిగి పిల్లలను తీసుకొని వెళ్లేందుకు రహదారికి ఓవైపు వాహనాన్ని నిలిపారు. రోడ్డు దాటుతున్న లోచనను టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారిని చికిత్స నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లోచన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి తండ్రి, సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ మన్మఽథరావు 2021లో కరోనా సమయంలో మృతిచెందగా తల్లి దేవి, సోదరి ఉన్నారు. దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్‌ఐ షేక్ మహ్మద్ అలీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె మృతితో దేవి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నన తీరు అక్కడి వారిని కలచివేసింది.