Share News

పొట్ట చేతబట్టి.. వలసబాట పట్టి!

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:46 AM

Over 200,000 people migrate from Srikakulam every year పొట్ట చేతబట్టి.. పల్లెను విడిచి.. వలసబాట పట్టడం సిక్కోలు ప్రజలకు నిత్యకృత్యంగా మారింది. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక, వ్యవసాయం గిట్టుబాటు కాక ఏటా 2 లక్షల మందికిపైగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

పొట్ట చేతబట్టి.. వలసబాట పట్టి!
మందస ఏజెన్పీ ప్రాంతంలో చిన్నారులతో సహా వలస వెళ్తున్న కుటుంబాలు (ఫైల్‌)

  • సిక్కోలులో ఏటా 2 లక్షల మందికిపైగా వలసలు

  • సాగు గిట్టుబాటు కాక.. స్థానికంగా ఉపాధి లేక అవస్థలు

  • పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం చర్యలు

  • నేడు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

  • మందస, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పొట్ట చేతబట్టి.. పల్లెను విడిచి.. వలసబాట పట్టడం సిక్కోలు ప్రజలకు నిత్యకృత్యంగా మారింది. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక, వ్యవసాయం గిట్టుబాటు కాక ఏటా 2 లక్షల మందికిపైగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కుటుంబాలతో సహా వలస వెళ్లేవారితో పలు గ్రామాల్లో ఇళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లలో వృద్ధులు మాత్రమే మిగులుతున్నారు. పిల్లల చదువులు సైతం వలసల కారణంగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన ప్రభుత్వాలకు కీలక సవాలుగా మారాయి. ఈనెల 17న శనివారం అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ సమస్యపై చర్చ జరుగుతున్న వేళ.. స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకొస్తున్న నేపథ్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • సేద్యంపైనే ఆధారం

  • జిల్లాలో సుమారు 3.40 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. ఏటా 2.60 లక్షల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు చేస్తున్నారు. చాలామంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా... ఆఫ్‌షోర్‌, వంశధార వంటి ప్రాజెక్టులు పూర్తికావడం లేదు. శివారు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జీడి, మామిడి, పత్తితోపాటు పలు రకాల రబీ, వాణిజ్య పంటలు అరకొర మాత్రమే. గిరిజనుల పోడు వ్యవసాయం కూడా లాభసాటిగా లేకపోవటంతో కాడివదిలేసే దుస్థితి నెలకొంది.సాగు గిట్టుబాటు కాక.. స్థానికంగా కూలి పనులు దొరక్క జిల్లా నుంచి ఏటా 2లక్షల మందికిపైగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. జిల్లాలోని మందస, మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, భామిని, కొత్తూరుతోపాటు పలు మండలాల్లో వలసలు అత్యధికంగా ఉన్నాయి. ఒక్కో కుటుంబం వారి ఆర్థిక అవసరాల మేరకు రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు వలస జీవితం గడుపుతున్నారు. ఇళ్ల వద్ద పిల్లల సంరక్షణ లేనివారు తమతో పాటు తీసుకెళ్తున్నారు. దీంతో సుమారు 20వేల మంది పిల్లలు చదువు ఏటా దెబ్బతింటోంది. విద్యార్థులు ముడునాలుగు నెలలపాటు బడులకు దూరమై చదువుల్లో వెనుకబడుతున్నారు.

  • కూటమి ప్రభుత్వం చొరవతో..

  • వలసల నివారణ కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు ఒక కుటుంబానికి వందరోజులు మాత్రమే ‘ఉపాధిహామీ’ పనిదినాలు ఉండేవి. ప్రభుత్వం ఆ పనిదినాలను 125 రోజులకు పెంచుతూ.. కూలీల వలసల నివారణకు చర్యలు చేపట్టింది.

  • ఔత్సాహిక ప్రారిశ్రామికవేత్తలును ప్రోత్సహించేందుకు వారికి రాయితీలు కల్పిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) వివరాలను ఉద్యమ్‌ పోర్టల్‌లో నమోదు చేసింది. జిల్లాలో 16,205 మంది ఇందులో నమోదయ్యారు. కాగా జీడి పరిశ్రమలు, రైస్‌మిల్లుల యజమానులు దీనిలో నమోదు కాలేదు. వీటిని ఈ పరిధిలోకి తెచ్చి యువతకు ప్రోత్సాహం అందించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

  • కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పేదరిక నిర్మూలన కోసం ఆదర్శ కుటుంబం పేరుతో పీ-4 సర్వే నిర్వహించారు. దీనిలో భాగంగా కుటుంబం మొత్తం వివరాలు, విద్య, నిరుద్యోగం, జీవన స్థితిగతులపై పూర్తిస్థాయిలో సర్వే చేసి.. వారిని ఆదుకొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉపాధి, పరిశ్రమలు, ఉద్యోగం వంటి పలు అంశాలను క్రోడీకరించి వారికి తగిన శిక్షణ అందించనున్నారు.

  • ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోకుండా.. ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13వేలు చొప్పున నిధులు జమ చేస్తోంది. ఈ డబ్బులు పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే వలస విద్యార్థులకు కోసం ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక వసతిగృహాన్ని ఏర్పాటు చేసింది.

Updated Date - Oct 17 , 2026 | 12:46 AM