మత్స్యకారుల సేవలో..
ABN , Publish Date - May 19 , 2026 | 12:02 AM
Deposit funds today సముద్రంపైనే ఆధారపడి జీవిస్తూ.. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని అమలు చేస్తోంది.
నేడు పథకం కింద నిధులు జమ
జిల్లాలో 16,737 మందికి రూ.33.47 కోట్ల లబ్ధి
సంప్రదాయ తెప్పలపై వేటాడే వారికీ దక్కిన అవకాశం
తీరప్రాంత రూపురేఖలు మారుస్తాం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, మే 18(ఆంధ్రజ్యోతి): సముద్రంపైనే ఆధారపడి జీవిస్తూ.. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని అమలు చేస్తోంది. మత్స్య సంపద ఉత్పత్తిలో భాగంగా ప్రభుత్వం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు (61 రోజులు) సముద్రంలో చేపల వేట నిషేధం విధిస్తోంది. ఈ సమయంలో మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో... మత్స్యకారుల సేవలో పథకం కింద అర్హులైన మత్స్యకారులకు ఏటా రూ.20వేలు చొప్పున అందజేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి మంగళవారం నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 16,737 మందికి లబ్ధి చేకూరనుంది.
జిల్లాలో పెరిగిన లబ్ధిదారులు
మత్స్యకార సంక్షేమంపై రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక దృష్టి సారించడంతో జిల్లాలో ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జిల్లావ్యాప్తంగా 15,548 మంది మత్స్యకారులకు రూ.31.09 కోట్లు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య 16,737కి చేరింది. వీరి బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.33,47,40,000 నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. కేవలం మోటారు బోట్లకే పరిమితం కాకుండా, సంప్రదాయ తెప్పలపై వేటాడే నాన్-మోటరైజ్డ్ పడవల మత్స్యకారులను సైతం ఈ దఫా పథకంలో చేర్చడంతో నిరుపేద మత్స్యకారులకు సైతం ఊరట లభించింది.
మెరుగైన ఉపాధి కల్పించేలా
కేవలం వేట నిషేధ సమయాల్లోనే కాకుండా.. మిగిలిన రోజుల్లోనూ మత్స్యకారులకు స్థానికంగా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న జిల్లాను అభివృద్ధి చేసి, మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మూలపేట పోర్టు అభివృద్ధితోపాటు, వివిధ దశల్లో ఉన్న జెట్టీల పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే స్థానికంగానే వేలాదిమందికి ఉపాధి లభించి మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ధీమా వ్యక్తం చేశారు. కాగా గత ప్రభుత్వాల హయాంలో అరకొర సాయంతో సరిపెట్టుకున్న మత్స్యకారులు.. ఇప్పుడు సాయం రెట్టింపు కావడం, పెండింగ్ ప్రాజెక్టులపై కూటమి సర్కారు ప్రత్యేక దృష్టి సారించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.