రెచ్చిపోతున్న దొంగలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:19 AM
Thefts in Palasa పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. లాక్డ్ మోనటరింగ్ సిస్టమ్‌పై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలు మాత్రం విలువైన ఆభరణాలను ఇంట్లో పెట్టి ఊర్లు, తీర్థయాత్రలకు వెళ్లిపోతున్నారు. ఇదే అదునుగా తాళాలు వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేసి.. చోరీలకు పాల్పడుతున్నారు.
పలాస-కాశీబుగ్గలో వరుస దొంగతనాలు
ఇళ్లకు, షాపులకు తాళాలు వేస్తే చాలు
నగదు, విలువైన ఆభరణాలు మాయం
బెంబేలెత్తుతున్న ప్రజలు
పలాస, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి):
గత నెల 11న కాశీబుగ్గలోని చిన్నతిరుమలగా పేరుగాంచిన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో దొంగలు చొరబడ్డారు. స్వామికి అలంకరించిన బంగారు నామాలు, వెండి వస్తువులైన శంకు, చక్రాలు, వక్షస్థలం దోచేశారు. మూడు హుండీలను పగులగొట్టి అందులో ఉన్న నగదు తస్కరించారు. వీటి విలువ రూ.50లక్షల వరకూ ఉంటుంది. జిల్లాకు చెందిన కరుడుగట్టిన దొంగలు ఈ ఘాతుకానికి ఒడిగట్టి.. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు.
ఈ నెల 7న కాశీబుగ్గ రోటరీనగర్‌లోని సునీతపాత్రో ఇంటిలోకి ఇద్దరు దొంగలు ప్రవేశించారు. బీరువా విరగ్గొట్టి లాకర్‌లో ఉన్న రూ.7.50 లక్షల విలువైన ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచేశారు.
ఈ నెల 8న పలాసలోని బత్తులవీధికి చెందిన మల్లా ప్రేమకుమారి అనే వృద్ధురాలికి ఇద్దరు మైనర్లు శీతలపానీయంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. శీతలపానీయం తాగిన తర్వాత ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె వద్ద ఉన్న రూ.2.50 లక్షలు నగదు, పావుతులం బంగారం చెవిదుద్దులు దొంగిలించారు. చివరకు పోలీసులకు చిక్కారు.
పలాస-కాశీబుగ్గలో ఓ అద్యశ్య వ్యక్తి తరచూ చోరీలకు పాల్పడుతున్నాడు. మెడికల్, సెల్‌ఫోన్, టైలరింగ్ దుకాణాలను టార్గెట్ చేస్తూ అర్ధరాత్రి 2 గంటల తర్వాత చోరీలు చేస్తూ.. నగదు తోపాటు విలువైన వస్తువులను పట్టుకుపోతున్నాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైనా.. ఆయన ఆచూకీ లభించడం లేదు. మన రాష్ట్రంలో కూడా అటువంటి చోరుడి వేలిముద్రలు లభించకపోవడం గమనార్హం.
తాజాగా కాశీబుగ్గ పూజారివీధిలోని సంతోషిమాత ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు ఆలయం తాళాలు విరగ్గొట్టి అమ్మవారికి అలంకరించిన రూ.1.70 లక్షల విలువైన 11 గ్రాముల బంగారు ఆభరణాన్ని అపహరించారు. మంగళవారం వేకువజామున ఆలయం తెరిచేందుకు అర్చకుడు దేవీప్రసాద్‌పండా రాగా.. తాళాలు విరగ్గొట్టి ఉన్నాయి. అనుమానంతో ఆలయంలో అమ్మవారిని అలంకరించిన వస్తువులు పరిశీలించగా చోరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులు, క్లూస్‌టీమ్ సభ్యులు మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
..ఇలా పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. లాక్డ్ మోనటరింగ్ సిస్టమ్‌పై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలు మాత్రం విలువైన ఆభరణాలను ఇంట్లో పెట్టి ఊర్లు, తీర్థయాత్రలకు వెళ్లిపోతున్నారు. ఇదే అదునుగా తాళాలు వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేసి.. చోరీలకు పాల్పడుతున్నారు. ఆలయాలను సైతం విడిచిపెట్టడం లేదు. భయం.. భక్తి లేకుండా దేవుడి విగ్రహాలకు అలంకరించిన బంగారం ఆభరణాలను దోచేస్తున్నారు. హుండీల్లో నగదును దోచుకుంటున్నారు. చోరీలు జరిగిన తర్వాత బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఓవైపు రైల్వేస్టేషన్, మరోవైపు జాతీయ రహదారి.. ఇంకోవైపు ఒడిశా సరిహద్దు కావడంతో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో నిత్యం ప్రజల రాకపోకలు, వాహనాల రద్దీ ఉంటుంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజాసంఘాల ఆందోళనలు, రాజకీయ నాయకుల అలజడులు జరుగుతూనే ఉంటాయి. వీటితోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అధికంగా పోలీసు సిబ్బంది ఉండాలి. కాగా ప్రత్యేక రక్షణ కవచం లేక.. నిఘా కొరవడుతోంది. రూరల్, మహిళా పోలీస్‌స్టేషన్లు లేవు. ట్రాఫిక్‌కు ప్రత్యేక సిబ్బంది లేరు. ఉన్నవారితోనే మొత్తం మోనటరింగ్ చేయాల్సి రావడంతో నిఘా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. సిబ్బంది కొరతతో పోలీసు ఉన్నతాధికారులు సైతం చేతులెత్తేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఫలితంగా దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
పలాస సీతమ్మతల్లి ఆలయం, బ్రాహ్మణతర్లా కాటమ్మతల్లి ఆలయం, తర్లాకోట కాలమ్మతల్లి ఆలయం, లక్ష్మిపురం శివాలయంలో ఏటా దొంగతనం జరగడం, విలువైన ఆభరణాలు పోవడం సర్వసాధారణమై పోయింది. సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు మాస్కులు ధరించి చోరీకి పాల్పడుతుండడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. పటిష్ఠమైన నిఘాతోనే నేరాలు అరికట్టడానికి అవకాశం ఉంది. దీనిపై పోలీసు బాస్ ఆలోచించి పలాస-కాశీబుగ్గకు కనీసం రూరల్ పోలీస్‌స్టేషన్, క్రైమ్ పోలీస్‌స్టేషన్లు మంజూరు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. రాత్రివేళల్లో కూడా నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉంది.