పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:07 AM
Former Minister Appalaraju's conspiracy exposed దానయ్య అనే నిరుపేద ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, ఆ నేరాన్ని మరొకరిపై నెట్టి చట్టం కళ్లుగప్పాలని చూసిన పలాస వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుట్రలు పోలీసుల దర్యాప్తులో బట్టబయలయ్యాయి.
వైసీపీ నేత, మాజీ మంత్రి అప్పలరాజు కుట్ర బట్టబయలు
కుమారుడు చేసిన ప్రమాదాన్ని కప్పిపుచ్చేందుకు భారీ స్కెచ్
సీసీటీవీ, కాల్ డేటా ఆధారంగా బట్టబయలు చేసిన పోలీసులు
సాక్షులు, మధ్యవర్తుల సమక్షంలో పక్కాగా ఆధారాల సేకరణ
టెక్నికల్ ఆధారాలు ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టులో ప్రస్తావన
శ్రీకాకుళం, జూలై 14(ఆంధ్రజ్యోతి) : దానయ్య అనే నిరుపేద ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, ఆ నేరాన్ని మరొకరిపై నెట్టి చట్టం కళ్లుగప్పాలని చూసిన పలాస వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుట్రలు పోలీసుల దర్యాప్తులో బట్టబయలయ్యాయి. తన కుమారుడు సీదిరి ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో ఓ అమాయక గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోగా.. ఆ నేరం నుంచి కొడుకును తప్పించుకునేందుకు అప్పలరాజు సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు యత్నించారు. ఒక అమాయకుడ్ని డమ్మీగా పెట్టి కేసును తప్పుదోవ పట్టించాలని చేసిన ప్రయత్నాలను పోలీసులు సాంకేతిక ఆధారాలతో (సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా) బెడిసికొట్టేలా చేశారు. ఈ నెల 10వ తేదీ రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో పలాస మున్సిపాలిటీ పరిధిలోని పాత ఎన్‌హెచ్-5 రోడ్డులో ఇండస్ట్రియల్ ఏరియా జంక్షన్ వద్ద చోటుచేసుకున్న ప్రమాదానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టులో పోలీసులు పొందుపరిచిన పూర్తి సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
వెలుగులోకి సంచలన విషయాలు
ఉన్నతాధికారుల ఆదేశాలతో జూలై 12న ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈ దర్యాప్తును చేపట్టారు.
సీసీటీవీ ఆధారాలు: అక్కుపల్లి జంక్షన్ వద్ద ఉన్న శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. రాత్రి 21.30:14 గంటల సమయంలో బైక్ నడిపింది ఆరవ్ అని స్పష్టంగా రికార్డయింది. అలాగే ప్రమాదంలో గాయపడిన ఆరవ్.. డాక్టర్ బాలకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు అక్కడి ఫుటేజీలు ధ్రువీకరించాయి.
కాల్ డేటా (సీడీఆర్‌ఎస్): ప్రమాదం జరిగిన రాత్రి 21:34:01 గంటలకు ఆరవ్ నుంచి సిద్ధార్త్ కు కాల్ వెళ్లినట్లు, వారు 22 సెకెన్ల పాటు మాట్లాడుకున్నట్లు తేలింది. ఆ సమయంలో ఆరవ్ ఫోన్ సిగ్నల్ (టవర్ ఐడీ : 405854101బి00001) ప్రమాద స్థలంలో ఉండగా, సిద్ధార్థ్ ఫోన్ సిగ్నల్ జీఎంఈ కాలనీలో ఉన్నట్లు సాంకేతికంగా నిర్ధారణ అయింది.
సాక్షులు, మధ్యవర్తుల విచారణ
పోలీసులు ఈ కేసులో కైజోల గ్రామానికి చెందిన బత్తిన విజయ్(22), నరసన్నపేట మండలం జమ్ము గ్రామానికి చెందిన మోయ పవన్ కుమార్ నాయుడు (34)లను సాక్షులుగా విచారించారు. అలాగే సోంపేట మండలం ఎకువూరు విలేజ్ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ చక్రధారి, కంచిలి మండలం గోకర్ణపురం గ్రామానికి చెందిన వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ తరిపిల మురళీ సమక్షంలో ఆధారాలు, పంచనామా నమోదు చేశారు. సిద్ధార్థ్ వాంగ్మూలం మేరకు ప్రమాదంలో ధ్వంసమైన ఆరవ్ సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు.
అరెస్ట్‌లు.. నాన్-బెయిలబుల్ సెక్షన్ల నమోదు
దర్యాప్తులో అసలు నిజాలు బయటపడటంతో సెక్షన్ 106(1) స్థానంలో కఠినమైన నాన్-బెయిలబుల్ సెక్షన్లు 105 (హత్యకాని నేరపూరిత మానవహననం), 61(2), 238, 240, 242, 249, 49 బీఎన్‌ఎస్‌లను జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. జూలై 13న ప్రధాన నిందితుడు సీదిరి ఆరవ్ (ఏ1)ను రాత్రి 19:15 గంటలకు, సిద్ధార్త్ (ఏ2)ను రాత్రి 20:30 గంటలకు అరెస్ట్ చేశారు. ఆరవ్ అరెస్టు సమాచారాన్ని అతని పెద్దనాన్న సీదిరి త్రినాథ్‌కు, సిద్ధార్త్ అరెస్టు సమాచారాన్ని అతని తండ్రి సురేంద్ర నారాయణ త్యాడికి అందజేశారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అయిన మాజీమంత్రి అప్పలరాజు (ఏ3) అరెస్టు ఇంకా పెండింగ్ లో ఉందని, తదుపరి విచారణ కొనసాగుతోందని కాశీబుగ్గ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తమ రిమాండ్ రిపోర్టులో న్యాయస్థానానికి స్పష్టం చేశారు.
మాజీమంత్రి అప్పలరాజుపై నమోదైన కేసులు...
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 239/2026 కేసులో మాజీమంత్రి సీదిరి అప్పలరాజు (ఏ3)పై నమోదైన కేసు వివరాలు పరిశీలిస్తే...
కేసులో పాత్ర: ఈ కేసులో సీదిరి అప్పలరాజును మూడో నిందితుడిగా చేర్చారు. ఈయన ప్రధాన నిందితుడైన సీదిరి ఆరవ్ తండ్రి.
నమోదైన సెక్షన్లు: కుట్ర, సాక్ష్యాలను మాయం చేయడం వంటి నేరాలకు పాల్పడినందుకు గాను అప్పలరాజు (ఏ3), సిద్ధార్థ్(ఏ2)లపై భారతీయ న్యాయ సంహిత-2023 లోని కింది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సెక్షన్లు : 61(2), 238, 240, 242, 249, 49 బీఎన్‌ఎస్
రిమాండ్ రిపోర్టు ప్రకారం అప్పలరాజుపై ఉన్న ఆరోపణలు
నేరపూరిత కుట్ర: ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ 39 ఆర్‌పీ 3591 నంబరు గల స్కోడా కారులో ఘటనా స్థలానికి చేరుకుని, తన కుమారుడు ఆరవ్‌ను చట్టపరమైన శిక్ష నుంచి తప్పించేందుకు ఏ1, ఏ2లతో కలిసి నేరపూరిత కుట్ర పన్నారు.
తప్పుడు సాక్ష్యానికి ప్రేరేపణ: ప్రమాదం చేసింది ఆరవ్ (ఏ1) అయినప్పటికీ, ఆ స్థానంలో సిద్ధార్థ్ త్యాడి (ఏ2)ని పెట్టి, బైక్ నడిపింది తానేనని నేరాన్ని అంగీకరించేలా అప్పలరాజు ప్రేరేపించారు.
సాక్ష్యాధారాలు మాయం చేసే యత్నం: సాక్ష్యాలను మాయం చేసే ఉద్దేశంతో, ప్రమాదానికి కారణమైన బైక్‌ను సంఘటనా స్థలం నుంచి తీసేయాలని సిద్ధార్థ్‌ను ఆదేశించారు. అనంతరం తన కుమారుడు ఆరవ్‌తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బాధితులకు ప్రలోభాలు: అసలు నేరస్థుడిని దాచిపెట్టేందుకు, కేసును ఉపసంహరించుకోవాలని మృతుని భార్య ద్రౌపదితో రూ. 8.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎన్‌వీ రమణ అనే వ్యక్తి ద్వారా రూ. 1,50,000 ముందస్తుగా చెల్లించి ఒక పత్రం కూడా రాయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ప్రస్తుత పరిస్థితి
పోలీసుల రిమాండ్ రిపోర్టు సమర్పించే సమయానికి సీదిరి అప్పలరాజు (ఏ3) అరెస్టు పెండింగ్‌లో ఉంది. పోలీసులను తప్పుదోవ పట్టించడం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను మాయం చేయడం వంటి అంశాల్లో అప్పలరాజు పాత్రను పూర్తిగా నిర్ధారించడానికి మరింత సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.