Share News

డ్రైవింగ్‌ చేస్తుండగా ఫిట్స్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:44 PM

ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గమధ్యలో డ్రైవర్‌కి ఫిట్స్‌ రావడంతో వారంతా ఆందోళన చెందారు.

డ్రైవింగ్‌ చేస్తుండగా ఫిట్స్‌
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్‌ సాయి

- బస్సును పక్కకు ఆపేసిన డ్రైవర్‌

- తప్పిన ముప్పు.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

సోంపేట, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గమధ్యలో డ్రైవర్‌కి ఫిట్స్‌ రావడంతో వారంతా ఆందోళన చెందారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తక్షణమే డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం సోంపేటలో చోటుచేసుకుంది. పర్లాఖిముండి నుంచి బరంపురం వైపు 40 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్‌ బస్సు బయలుదేరింది. బుధవారం మధ్యాహ్నం సోంపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గరకు వస్తున్న సమయంలో బస్సు డ్రైవర్‌ సాయికి ఫిట్స్‌ వచ్చింది. తనకు కళ్లు తిరుగుతుండడంతో పాటు ఒంట్లో ఇబ్బంది ఉండడంతో వెంటనే బస్సును పక్కకు తిపి ఆపేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న డ్రైవర్‌ యూనియన్‌ సభ్యులు దీనిని గమనించారు. వెంటనే స్పందించి డ్రైవర్‌ను పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో బస్సును పక్కకు ఆపడంతో పెద్ద గండం తప్పిందని ప్రయాణికులతోపాటు పట్టణ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 11:44 PM