ఆక్రమించెయ్!
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:16 PM
జిల్లాలో చెరువులు, బందలు కబ్జాకు గురవుతున్నాయి. ఆక్రమణదారులు యథేచ్ఛగా చెరువు గర్భాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు.
- కబ్జాకు గురవుతున్న చెరువులు, బందలు
- మట్టితో కప్పేసి భవనాల నిర్మాణం
- కానరాని రక్షణ చర్యలు
- పట్టించుకోని అధికారులు
- టెక్కలి మేజర్ పంచాయతీకి ఆనుకొని ఉన్న తొలుసురుపల్లి గ్రామ సమీపంలో సర్వే నెంబర్ 575లో సుమారు 8.13 ఎకరాల విస్తీర్ణంలో దుంపల చెరువు ఉంది. ఈ చెరువు గర్భంలో ఓ వ్యక్తి కంకర పోసి చదును చేస్తున్నాడు. చెరువుకు చుట్టుపక్కల మూడు ఎకరాలకు పైగా ఆక్రమించి సిమెంట్‌తో గట్టుకట్టి అమ్మకాలకు సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ఒక అడుగు సుమారు రూ.లక్ష వరకు పలుకుతోంది. ఆక్రమణలకు కొంతమంది రెవెన్యూ అధికారు సహకరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
- తొలుసురుపల్లిలోని సర్వేనెంబర్ 560లో ఎర్రబంద చెరువు ఉంది. దీని విస్తీర్ణం 2.59 ఎకరాలు కాగా, ప్రస్తుతం ఆక్రమణలతో పిల్ల కాలువగా కనిపిస్తుంది. చెరువుకు రెండువైపులా కొంతమంది భూములు కొనుగోలు చేశారు. వీరు చెరువును మట్టితో కప్పి భవనాలు నిర్మిస్తున్నారు. గట్టుపై ఇళ్లు కడుతున్నా అడిగే నాథుడు కరువయ్యాడు.
-మెళియాపుట్టి పాత తహసీల్దార్ కార్యాలయం వెనుకభాగంలో ఉన్న పాతచెరువు ఆక్రమణకు గురవుతోంది. ఈ చెరువు విస్తీర్ణం సుమారు మూడు ఎకరాలు. ఇందులో కొంత భాగాన్ని అధికా రులు ఆర్టీసీకి ఇచ్చారు. మిగిలిన భాగాన్ని ఓ వ్యక్తి మట్టితో కప్పేసి లేఅవుట్ వేశాడు. పైగా ఈ లేఅవుట్‌కు ప్రభుత్వ భూమి నుంచి దారి కల్పించారు. ఈ భూమి వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇక్కడ అడుగు ధర రూ.2లక్షలు వరకు పలుకుతోంది.
టెక్కలిరూరల్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చెరువులు, బందలు కబ్జాకు గురవుతున్నాయి. ఆక్రమణదారులు యథేచ్ఛగా చెరువు గర్భాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువులను మట్టితో కప్పేసి ప్లాట్లుగా మార్చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 5,952 చెరువులు ఉన్నాయి. వంద ఎకరాలు కంటే తక్కువ ఆయకట్టు ఉన్న చెరువులు 5,262, వంద ఎకరాలకు పైన ఆయకట్టు ఉన్నవి 690 వరకు ఉన్నాయి. చిన్నాపెద్ద చెరువుల ఆయకట్టు విస్తీర్ణం 1,89,169 ఎకరాలు వరకు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. వంశధార పరిధిలో 269 వరకు చెరువులు ఉన్నాయి. గతంలో ఈ చెరువులు వ్యవసాయ భూములకు పుష్కలంగా సాగునీరు అందించేవి. ప్రస్తుతం ఇందులో చాలా చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువులను మాయంచేసి ప్లాట్లుగా మార్చేశారు. అధికంగా పట్టణ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న చెరువులను కబ్జా చేసి అమ్మకాలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఉన్న చెరువులను కొంతమంది రైతులు వ్యవసాయ భూములుగా తయారు చేసి పంటలు పండిస్తున్నారు.
-చెరువుల ఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులు వస్తుండడంతో ఇటీవల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. ఆక్రమణదారుల్లో ఎంతటివారు ఉన్నా వదలొద్దని అధికారులను ఆదేశించారు. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే, ఎంత వరకు ఆక్రమణలు గుర్తించి తొలగిస్తారో వేచి చూడాలి. కొంతమంది తప్పుడు సర్వే నెంబర్లు వేసి అమ్మకాలు చేసినట్లు తెలుస్తుంది. వీటిపై విజిలెన్స్ విచారణ నిర్వహిస్తే అసలు విషయం బయటపడుతుందని రైతులు అంటున్నారు.
‘జలధార’ ఏదీ?
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జలధార.. జలహారతి కార్యక్రమం కింద చెరువులు, సాగునీటి కాలువల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి జిల్లా అధికారులు అంచనాలు తయారు చేసి పంపించారు. అయితే తక్కువ చెరువులకే నిధులు మంజూరు చేయడంతో అరకొర పనులు జరుగుతున్నాయి. దీంతో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడా ఆక్రమణలు గుర్తించే పరిస్థితి లేదు. ఉన్న చెరువులో పనులు చేసి వదిలేస్తున్నారు. కాలువల్లో కూడా పూడికతీత పనులే తప్ప ఆక్రమణలు తొలగిస్తున్న దాఖలాలు లేవు.
చర్యలు తీసుకుంటాం
చెరువుల ఆక్రమణలపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టాం. సాగునీటి చెరువులు ఆక్రమణకు గురైతే రైతులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చును.
బి.పాపారావు, తహసీల్దార్, మెళియాపుట్టి