‘ఉద్యమాలతోనే వంశధార జలాల సాధన’
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:20 AM
రైతులు ఐక్యతతో ఉద్యమాలు చేపడితేనే వంశధార జలాల సాధన సాధ్యమవుతుందని సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేయం ఏపీ కన్వినర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.
హరిపురం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): రైతులు ఐక్యతతో ఉద్యమాలు చేపడితేనే వంశధార జలాల సాధన సాధ్యమవుతుందని సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేయం ఏపీ కన్వినర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. మందస మండలం హరిపురంలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో వంశధార జలాల సాధన కమిటీ ఆఽధ్యక్షులు మార్పు మన్మథరావు ఆధ్యక్షతన ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఇచ్ఛాపురం వరకు వంశధార జలాలు పొడిగిస్తే పంటలు పండి రైతుకు రెట్టింపు ఆదాయం వస్తుందన్నారు. దీంతో వలసల నివారణ సాధ్యమవుందని అభిప్రాయ పడ్డారు. రైతుల జీవితాల్లో మార్పులు రావాలంటే సాగునీరందివ్వాలన్నారు. బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టే వారికి రుణమాఫీ, లక్షల కోట్ల రూపాయలు బహుళజాతి కంపెనీలకు వృథాగా రాయితీలు ఇస్తుంటారని విమర్శించారు. దేశానికి వెన్నుముకైన రైతులకు రుణమాఫీ చేసి ఆదుకుంటే కాడి ముందుకు కదులుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్యాక్షులు పి .ప్రసాద్, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.వర్మ, వివిధ ప్రజా సంఘాల నాయకులు హేమారావు చౌదరి, వెంకటరావు, సోమనాథం, నల్ల హడ్డీ, వంకల మాధవరావు, సన్నశెట్టి రాజశేఖర్, బాబూరావు, కుసుమ, మామిడి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.