Share News

పాలిటెక్నిక్‌తో భవితకు భరోసా

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:19 AM

Polycet on the 25th of next month పాలిటెక్నిక్‌ కోర్సులకు మరింత డిమాండ్‌ పెరుగుతోంది. పదోతరగతి పూర్తయిన తర్వాత మూడేళ్లపాటు ఈ కోర్సు పూర్తిచేస్తే నైపుణ్యంతో పాటు ఉద్యోగం గ్యారంటీ అనే భావన ఉంది. అందుకే చిన్నవయసులోనే జీవితంలో స్థిరపడాలనుకునేవారు ముందుగా ఈ కోర్సులనే ఎంచుకుంటున్నారు.

పాలిటెక్నిక్‌తో భవితకు భరోసా
శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల

వచ్చేనెల 25న పాలిసెట్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ

జిల్లాలో 2,163 సీట్ల భర్తీకి సన్నాహాలు

ఎచ్చెర్ల, మార్చి 22(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ కోర్సులకు మరింత డిమాండ్‌ పెరుగుతోంది. పదోతరగతి పూర్తయిన తర్వాత మూడేళ్లపాటు ఈ కోర్సు పూర్తిచేస్తే నైపుణ్యంతో పాటు ఉద్యోగం గ్యారంటీ అనే భావన ఉంది. అందుకే చిన్నవయసులోనే జీవితంలో స్థిరపడాలనుకునేవారు ముందుగా ఈ కోర్సులనే ఎంచుకుంటున్నారు. ఈ కోర్సులో చేరేందుకుగాను వచ్చేనెల 25న పాలిసెట్‌ నిర్వహించనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పాలిసెట్‌ రాసేందుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఉమ్మడి జిల్లాలో సీట్ల వివరాలు-

ఉమ్మడి జిల్లాలో శ్రీకాకుళంలో రెండు, ఆమదాలవలస, టెక్కలి, సీతంపేటలో చెరొకటి వంతున మొత్తం ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. మరో నాలుగు ప్రైవేటు కళాశాలలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 663 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 1,500 సీట్లు మొత్తం 2,163 సీట్లు ఖాళీ ఉన్నాయి. పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తయిన తర్వాత ఈసెట్‌ రాసి నేరుగా ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో చేరవచ్చు.

పాలిసెట్‌ ఇలా -

భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం సబ్జెక్ట్‌ల్లో 120 మార్కులకు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో పాలిసెట్‌ ఉంటుంది. పదో తరగతి స్టాండర్డ్‌ మేరకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. ర్యాంకుల ఆధారంగా అభ్యర్థుల ఆప్షన్‌ మేరకు కళాశాలలు, కోర్సుల కేటాయిస్తారు. జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కంప్యూటర్స్‌, సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ తదితర కోర్సులు ఉన్నాయి. విద్యార్థుల ఆసక్తి మేరకు ఏ కోర్సులో చేరినా ఇష్టంగా చదివితే ఉజ్వల భవిత పొందవచ్చని విద్యావేత్తలు చెబుతున్నారు. డిప్లమో పూర్తిచేసినవారు చాలా రంగాల్లో ఉన్నతంగా స్ధిరపడ్డారు.

దరఖాస్తు చేయాలి

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరాలనుకున్న విద్యార్థులు పాలిసెట్‌ రాసేందుకు నిర్దేశించిన గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఏప్రిల్‌ 25న పాలిసెట్‌ నిర్వహిస్తారు. పాలిసెట్‌లో మంచి ర్యాంకు సాధనకు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి. పాలిసెట్‌ కోసం ఆసక్తి గల విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నారు.

- డాక్టర్‌ కె.నారాయణరావు, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, శ్రీకాకుళం

Updated Date - Mar 23 , 2026 | 12:19 AM