రెండో విడత రెడీ
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:27 AM
Elections in Srikakulam and Amadalavalasa municipalities జిల్లాలో రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఈ దశలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతోపాటు ఆమదాలవలస మునిసిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఘట్టం నుంచి ఓట్ల లెక్కింపు వరకు కీలక తేదీలను, అభ్యర్థుల వ్యయ పరిమితులు, రిజర్వేషన్ల వివరాలను ఎస్‌ఈసీ ప్రకటించింది.
శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మునిసిపాలిటీల్లో ఎన్నికల నగారా!
ఈ నెల 26న పోలింగ్.. 30న ఓట్ల లెక్కింపు
మేయర్, చైర్‌పర్సన్ పీఠాలు జనరల్ మహిళలకే..
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల
శ్రీకాకుళం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఈ దశలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతోపాటు ఆమదాలవలస మునిసిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఘట్టం నుంచి ఓట్ల లెక్కింపు వరకు కీలక తేదీలను, అభ్యర్థుల వ్యయ పరిమితులు, రిజర్వేషన్ల వివరాలను ఎస్‌ఈసీ ప్రకటించింది. మేయర్, చైర్‌పర్సన్ స్థానాలు రెండూ మహిళలకే దక్కనుండటంతో ఆయా పార్టీల్లో టికెట్ల వేట ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల షెడ్యూల్ ఇదే...
ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ. 17న నామినేషన్ల పరిశీలన. 19న నామినేషన్ల ఉపసంహరణ. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన. 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. 27న అవసరమైతే రీపోలింగ్. 30న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు.
మహిళలకే పెద్దపీట...
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 60 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆమదాలవలస మున్సిపాలిటీలో 28 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. అత్యంత కీలకమైన శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్ స్థానంతో పాటు ఆమదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని సైతం జనరల్ మహిళకు కేటాయిస్తూ ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీంతో రెండు చోట్లా మహిళా నేతలే పీఠాన్ని అధిరోహించనున్నారు.
ధరావతు, వ్యయ పరిమితులు ఇలా...
డిపాజిట్లు(ధరావతు): శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్ స్థానాలకు పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2,500 చొప్పున ధరావతు చెల్లించాలి. ఆమదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులపైనా ఎస్‌ఈసీ ఆంక్షలు విధించింది. శ్రీకాకుళం మేయర్ అభ్యర్థి గరిష్టంగా రూ. 25 లక్షలు, కార్పొరేటర్ అభ్యర్థి రూ.10 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు. ఆమదాలవలస మున్సిపాలిటీకి సంబంధించి చైర్‌పర్సన్ అభ్యర్థి రూ.20 లక్షలు, వార్డు సభ్యులు రూ.7.50 లక్షల వరకు మాత్రమే ఎన్నికల కోసం వ్యయం చేసేందుకు అవకాశం కల్పించారు.
శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని మేయర్‌తోపాటు 60 డివిజన్లలో కార్పొరేటర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ జి.శ్రావణ్‌కుమార్ తెలిపారు. మేయర్ పదవికి పోటీ చేసి అభ్యర్థుల నామినేషన్లను కలెక్టరేట్‌లోని జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో స్వీకరించనున్నామన్నారు. కార్పొరేటర్ అభ్యర్థుల నామినేషన్లను బొందిలీపురం రోడ్డులోని వంశధార కార్యాలయ ప్రాంగణంలో స్వీకరించనున్నట్టు వెల్లడించారు.
టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదల కావడంతో ఆమదాలవలసలో రాజకీయ సందడి మొదలైంది. మునిసిపాలిటీలో 28 వార్డులు ఉండగా.. రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో ఎన్నికల బరిలో దిగేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కూటమిలో టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపఽథ్యంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ కూటమి పార్టీల తరపున ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి వార్డులో ఆశావహుల పేర్లను నమోదు చేస్తూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఎవరికి టిక్కెట్ కేటాయించినా మిగిలిన వారంతా సమష్టిగా పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది.
ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనిల్‌చంద్ర పునేఠా మాట్లాడుతూ ‘రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నాం. ఈ నెల 13న మొదటి దశ, 16న రెండో దశ, 19న మూడవ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నాం. తొలి విడత పోలింగ్ ఈ నెల 26న, రెండవ దశ 29న, మూడో దశ డిసెంబరు 2న పోలింగ్ నిర్వహిస్తాం. ఆయా రోజుల్లోనే కౌంటింగ్ చేపట్టనున్నాం. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో గతంలో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను మరింత క్రమబద్ధంగా నిర్వహించాలి. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేయాలి. నామినేషన్ల కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులకు సంబంధించిన రికార్డులను కనీసం 60 రోజులపాటు భద్రపరచాల’ని ఆదేశించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి పరోక్ష ఎన్నికలను నవంబరు 23న నిర్వహించనున్నట్లు తెలిపారు. 19న మండల పరిషత్ అధ్యక్షుడు, 20న జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి డీఆర్వో విశ్వేశ్వరరావు, డీపీవో స్వరూపరాణి, శ్రీకాకుళం, ఆముదాలవలస మున్సిపల్ కమిషనర్లు జి.శ్రావణ్‌కుమార్, తమ్మినేని రవి, డీఎస్పీ ధనుంజయనాయుడు పాల్గొన్నారు.