Share News

నేడు రెండో విడత పల్లెపోరు

ABN , Publish Date - Nov 29 , 2026 | 12:01 AM

Polling in 13 mandals జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం 13 మండలాల్లోని 342 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు, 2,562 వార్డుల్లో సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్‌ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడించనున్నారు.

నేడు రెండో విడత పల్లెపోరు
ఎచ్చెర్లలో పోలింగ్‌ సామగ్రిని సరిచూసుకుంటున్న అధికారులు, సిబ్బంది

  • 13 మండలాల్లోని 342 పంచాయతీలు, 2,526 వార్డులకు పోలింగ్‌

  • తీర్పు ఇవ్వనున్న 5.67 లక్షల మంది ఓటర్లు

  • పకడ్బందీగా అధికారుల ఏర్పాట్లు

  • శ్రీకాకుళం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం 13 మండలాల్లోని 342 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు, 2,562 వార్డుల్లో సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్‌ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికల నిర్వహణకు 2,856 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 46 పంచాయతీలను అతి సమస్యాత్మకమైనవిగా, 88 పంచాయతీలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, విద్యార్థుల వెబ్‌స్ట్రీమింగ్‌ ద్వారా వంద శాతం నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు లేని 71 సాధారణ పంచాయతీల్లో పోలింగ్‌ సరళిని చిత్రీకరించేందుకు 101 మంది వీడియోగ్రాఫర్లను నియమించారు. శనివారం పోలింగ్‌ అధికారులు, సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. సిబ్బంది, ఎన్నికల సామగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు తరలింపునకు 300 వాహనాలను సమకూర్చారు.

  • నేడు ఎన్నికలు జరగనున్న మండలాలు:

  • ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, లావేరు, ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, కొత్తూరు, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, పాతపట్నం, మెళియాపుట్టి

  • ఏకగ్రీవాల జోరు.. మెళియాపుట్టి టాప్‌...

  • రెండో విడతలో మొత్తం 388 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో 46 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా మెళియాపుట్టి మండలంలో 8 పంచాయతీలు, తర్వాత పాతపట్నంలో 7, కొత్తూరులో 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 3,618 వార్డులకుగాను 1,090 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎచ్చెర్ల, మెళియాపుట్టి మండలాల్లో ఒక్కో వార్డు చొప్పున రెండుచోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 2,526 వార్డులకు పోలింగ్‌ జరగనుంది. అత్యఽధికంగా రణస్థలం మండలంలో 280, కొత్తూరులో 278, ఎచ్చెర్లలో 234 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.

  • ఓటర్లలో మహిళలదే పైచేయి..

  • రెండో విడతలో మొత్తం 5,67,478 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 2,83,618 మంది, మహిళలు 2,83,838 మంది, ఇతరులు 22 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 220 మంది అధికంగా ఉండటం విశేషం. అత్యధిక ఓటర్లు ఉన్న మండలాల్లో ఎచ్చెర్ల (64,943) ప్రథమ స్థానంలో నిలవగా, రణస్థలం (64,794), పొందూరు (57,948) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా ఎల్‌.ఎన్‌.పేట మండలంలో 21,975 మంది ఓటర్లు ఉన్నారు.

  • విధులకు గైర్హాజరైతే కఠినచర్యలు: కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులు, సిబ్బందిపై సస్పెన్షన్‌తోసహా కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. ‘ఎన్నికల విధుల్లో అలసత్వానికి తావులేదు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన కేంద్రాల్లో రిపోర్టు చేయాలి. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే పీవోలు, ఇతర పోలింగ్‌ అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరవ్వాలి. తొలివిడత ఎన్నికల్లో విధులకు హాజరుకాని వారికి ఇప్పటికే నోటీసులు పంపాం. రెండు, మూడో విడత ఎన్నికల్లో కూడా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల’ని కలెక్టర్‌ ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి, ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

  • పటిష్ఠ బందోబస్తు సిద్ధం: ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

  • జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు సిద్ధం చేశామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసులు, సిబ్బందికి శనివారం దిశానిర్దేశం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, నగదు, మద్యం పంపిణీ వంటి అ క్రమాలను అరికట్ట్టాలని పోలీసులకు ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కౌంటింగ్‌ కేం ద్రాల వద్ద భద్రత కల్పిస్తూ ఫలితాల అనంతరం అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • రెండో విడత పోలింగ్‌ ఇలా(డివిజన్ల వారీ)

    -------------------------------------------------

  • వివరాలు శ్రీకాకుళం టెక్కలి మొత్తం

  • --------------------------------------------------

  • మండలాలు 8 5 13

  • పంచాయతీలు 213 129 342

  • వార్డులు 1,653 999 2,855

  • ఓటర్ల సంఖ్య 3,73,932 1,93,546 5,67,478

  • --------------------------------------------------

Updated Date - Nov 29 , 2026 | 12:01 AM