Share News

ఐదుగురి ప్రాణాలు కాపాడిన సీట్‌బెల్ట్‌

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:20 AM

జాతీయ రహదారిపై అత్యంత వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టి డివైడర్‌ను ఢీకొంది.

ఐదుగురి ప్రాణాలు కాపాడిన సీట్‌బెల్ట్‌
ఘటన జరిగిన తీరును పరిశీలిస్తున్న ఎస్‌ఐ గణేష్‌, నేషనల్‌ హైవే అంబులెన్స్‌ సిబ్బంది

  • జాతీయ రహదారిపై అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు

  • సురక్షితంగా బయటడిన ఒడిశా వాసులు

నరసన్నపేట, మార్చి 16(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై అత్యంత వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టి డివైడర్‌ను ఢీకొంది. ఈ కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వారంతా సీట్‌బెల్ట్‌ పెట్టుకోవడంతో చిన్నచిన్న గాయాలతో సురక్షితంగా బయటపడిన ఘటన నరసన్నపేట శివారులో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గణేష్‌ తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన సురేష్‌కుమార్‌ సాహు తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం విశాఖ జిల్లా సింహాచలం వెళ్లి వరహానరసింహ స్వామివారిని దర్శించుకొని తిరుగు పయనం అయ్యారు. ఈ క్రమంలో గుండువిల్లిపేట దాటిన తర్వాత నరసన్నపేట సమీపంలో గల పెట్రోల్‌ బంకు దాటిన తర్వాత కారు అదపు తప్పి డివైడర్‌ను ఢీకొని మూడు పల్టీలు కొట్టి డివైడర్‌కు పైకి వెళ్లి రైలింగ్‌ను ఢీకొని ఆగింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న వాహనదారులు అప్రమత్తమై కారులో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులకు బయటకు తీశారు. వారంతా సీట్‌బెల్ట్‌లు పెట్టుకోవడంతో చిన్నచిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం చూసినవారు భయబ్రాంతులకు గురైయ్యారు. కారులో ఉన్న వారు సురక్షితంగా బయటపడడంతో అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్‌ హైవే అంబులెన్స్‌ చేరుకొని సిబ్బంది బాధితులును పరిశీలించి, స్వల్ప గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బి.గణేష్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేయనున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 17 , 2026 | 12:20 AM