బడి.. సందడి
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:21 AM
Increase in enrollments in government schools పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లూ వేసవి సెలవుల్లో సరదాగా ఆడిపాడిన విద్యార్థులంతా.. శుక్రవారం బడిబాట పట్టారు. ఉపాధ్యాయులకు వందనం చేస్తూ.. తోటి విద్యార్థులను ఆత్మీయంగా పలుకరిస్తూ తొలిరోజు సందడిగా గడిపారు.
పాఠశాలలు పునఃప్రారంభం
ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు
విద్యార్థుల ఆత్మీయ పలుకరింపులు
శ్రీకాకుళం/ నరసన్నపేట/ కాశీబుగ్గ, జూన్ 12(ఆంధ్రజ్యోతి): పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లూ వేసవి సెలవుల్లో సరదాగా ఆడిపాడిన విద్యార్థులంతా.. శుక్రవారం బడిబాట పట్టారు. ఉపాధ్యాయులకు వందనం చేస్తూ.. తోటి విద్యార్థులను ఆత్మీయంగా పలుకరిస్తూ తొలిరోజు సందడిగా గడిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య పెరగడంతో.. ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారు 12 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. సర్కారు పాఠశాలల బలోపేతంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించడం, గుణాత్మకమైన విద్యనందించడంతో వీటిలో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2,652 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో గతేడాది 1,59,032 మంది విద్యార్థులు చదివారు. ఈ ఏడాది 1.75 లక్షలకు విద్యార్థుల సంఖ్య చేరే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది నుంచి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ అమలు చేస్తామన్నారు. ఐదోతరగతి నుంచి హిందీ బోధన, ఒకటో తరగతి నుంచి నైతిక విలువలు పెంపొందించేలా పాఠ్యప్రణాళిక రూపొందించామని వెల్లడించారు.
ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సందడి నెలకొంది. నరసన్నపేట మండలంలో వివిధ ప్రైవేటు పాఠశాలలో చదివే 296 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. నరసన్నపేట బోర్డు ఆదర్శ పాఠశాల, పెద్దపేట, సత్యవరం, బొరిగివలస తదితర పాఠశాలలో అత్యధికంగా ప్రవేశాలు నమోదయ్యాయని ఎంఈవోలు ఉప్పాడ శాంతారావు, పి.దాలినాయుడు తెలిపారు. లుకలాం ఉన్నత పాఠశాలను డిప్యూటీ డీఈవో విజయకుమారి శుక్రవారం పరిశీలించారు.
అలాగే కాశీబుగ్గ జిల్లాపరిషత్ హైస్కూల్లో శుక్రవారం తమ పిల్లలను చేర్పించేందుకు అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు బారులుదీరారు. పలాస -కాశీబుగ్గలో ప్రైవేటు పాఠశాలల నుంచి చాలామంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరారు. ఏటా తమ స్కూల్‌లో 300 వరకు కొత్త అడ్మిషన్లు జరుగుతాయని ప్రధానోపాధ్యాయులు చిన్నంనాయుడు తెలిపారు.