Share News

అర్హులందరికీ పథకాలు అందాలి

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:27 AM

‘ప్రతీ పథకం అర్హులందరికీ శతశాతం అందేలా పనిచేయాలి. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

 అర్హులందరికీ పథకాలు అందాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

- ‘జలధార’ పనులు 99శాతం పూర్తి

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): ‘ప్రతీ పథకం అర్హులందరికీ శతశాతం అందేలా పనిచేయాలి. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి వివిధ మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, సత్వర ఫలితాలు వచ్చేలా క్షేత్రస్థాయిలో ప్రగతి సాధించాలన్నారు. ‘జలధార’ పనుల్లో జిల్లా అద్భుత ప్రగతి సాధించిందని, మొత్తం 4,766 పనులకు గాను 4756 పనులు(99.7) పూర్తయ్యాయన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం నూతనంగా ప్రవేశపెట్టిన ‘నమో వన యోజన’ కింద నేషనల్‌ కాంపా నిధులతో ముమ్మరంగా మొక్కలు నాటాలన్నారు. హెక్టారుకు 30వేల నుంచి 40వేల మొక్కల సాంద్రత ఉండేలా, జియో ట్యాగింగ్‌ చేస్తూ పర్యవేక్షించాలని ఆదేశించారు. ‘మనమిత్ర’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ శిక్షణలో జల్లా వెనుకబడడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై మండలాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి, శతశాతం నమోదు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రతీ శుక్రవారం ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. గత వారం 2,93,561 ఇళ్లను సందర్శించి, దోమల నివారణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 3,20,333 రక్త నమూనాలను పరీక్షించగా కేవలం ఆరు మలేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయని, అలాగే 3,837 నీటి పరీక్షల్లో కాలుష్యం శూన్యమని తేలిందని తెలిపారు. పాఠశాలలు, హాస్టళ్లలో క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయాల తనిఖీలు, కోర్టు కేసులు, వీఐపీ రిఫరెన్స్‌ లేఖల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Jul 16 , 2026 | 12:27 AM