Share News

పరిషత్‌ పోరు

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:58 PM

Mptc, Zptc election Polling on the 3rd జిల్లాలోని రెండు మునిసిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ గడువు ముగియగా.. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సమరానికి తెరలేచింది. స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సోమవారం నగారా మోగించింది.

పరిషత్‌ పోరు
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

  • జిల్లాలో 30 జడ్పీటీసీ, 542 ఎంపీటీసీ స్థానాలకు పోటీ

  • రేపటి నుంచి నామినేషన్లు

  • నవంబరు 3న పోలింగ్‌.. 5న ఫలితాలు

  • శ్రీకాకుళం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెండు మునిసిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ గడువు ముగియగా.. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సమరానికి తెరలేచింది. స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సోమవారం నగారా మోగించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా.. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా కోడ్‌ అమల్లోకి రావడంతోపాటు పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది.

  • జిల్లాలోని 30 మండల ప్రజా పరిషత్‌లు(ఎంపీపీ), 30 జడ్పీటీసీ స్థానాలతోపాటు 542 ఎంపీటీసీ స్థానాలకు నవంబరు 3న ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రామాల్లో పట్టు నిరూపించుకునేందుకు, మండల పరిషత్‌లతోపాటు జిల్లా పరిషత్‌ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి.

  • పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఇదీ..

  • ఈ నెల 21న రిటర్నింగ్‌ అధికారి ద్వారా ఫారం-2లో ఎన్నికల నోటీసు జారీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శన, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది.

  • 23న నామినేషన్ల దాఖలుకు తుది గడువు

  • 24న నామినేషన్ల పరిశీలన

  • 25న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీలుకు అవకాశం

  • 26న అప్పీళ్ల విచారణ, పరిష్కారం

  • 27న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు గడువు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ

  • నవంబరు 3న: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌

  • 4న : ఎక్కడైనా అవసరమైతే.. రీ-పోలింగ్‌

  • 5న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన

  • అప్పీళ్లకు ప్రత్యేక యంత్రాంగం

  • పరిశీలనలో నామినేషన్లు తిరస్కరణకు గురైతే అభ్యర్థులు అప్పీలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఎంపీటీసీ అభ్యర్థులు సంబంధిత రెవెన్యూ డివిజనల్‌ అధికారి వద్ద, జడ్పీటీసీ అభ్యర్థులు కలెక్టర్‌ ఎదుట ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్పీలు చేసుకోవాలి. అధికారులు ఈ అప్పీళ్లను 26న పరిష్కరిస్తారు.

  • కోర్టు ఉత్తర్వుల వల్ల ఎన్నిక నిలిచిపోయిన స్థానాలకు లేదా పరిపాలనా, న్యాయపరమైన అడ్డంకులున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎలాంటి ఎన్నికల నోటీసు జారీ చేయరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. షెడ్యూల్‌ విడుదల కావడంతో జిల్లా అధికార యంత్రాంగం బ్యాలెట్‌ బాక్సుల తరలింపు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది.

  • అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి: కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌

  • ‘జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి. అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, రిసెప్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సామగ్రి భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలను గుర్తించాలి. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. నామినేషన్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు స్కాన్‌చేసి అప్‌లోడ్‌ చేయాలి. కంట్రోల్‌ రూమ్‌లు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే ఉద్యోగులు, ఇతర అర్హులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. ఎన్నికల సిబ్బందికి శిక్షణ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయండి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, వెబ్‌కాస్టింగ్‌ సహా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాల’ని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, ఆర్డీవోలు కె.సాయిప్రత్యూష, కృష్ణమూర్తి, అప్పలరాజు, జడ్పీ సీఈవో ఆర్‌.వెంకటరామన్‌, డీపీవో స్వరూపరాణి, వివిధ నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 11:58 PM