Share News

స్కీమ్‌ పేరుతో స్కాం

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:23 AM

‘మా సంస్థలో కొత్త స్కీమ్‌ పెట్టాం. ఇందులో చేరండి.. అధిక ఆదాయం పొందండి’ అని చిట్స్‌ వ్యాపారి చెప్పడంతో వారంతా నమ్మారు.

 స్కీమ్‌ పేరుతో స్కాం
వివరాలు వెల్లడిస్తున్న సీఐ రామకృష్ణ, వెనుకన నిందితుడు శ్రీధర్‌(ముసుగు ధరించిన వ్యక్తి)

- రూ.80 లక్షలతో చిట్స్‌ వ్యాపారి పరారీ

- పోలీసులను ఆశ్రయించిన బాధితులు

- నిందితుడి అరెస్టు

పలాస, జూలై 8(ఆంధ్రజ్యోతి): ‘మా సంస్థలో కొత్త స్కీమ్‌ పెట్టాం. ఇందులో చేరండి.. అధిక ఆదాయం పొందండి’ అని చిట్స్‌ వ్యాపారి చెప్పడంతో వారంతా నమ్మారు. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు చెందిన 200 మందికి పైగా ఈ స్కీమ్‌లో చేరారు. తీరా గడువు సమీపించడంతో రూ.80లక్షలతో చిట్స్‌ వ్యాపారి పరారయ్యాడు. దీంతో బాధితులు కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ వివరాలను కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ బుధవారం విలేకరులకు వెల్లడించారు. కాశీబుగ్గ ఆర్‌కే పోలీసు కాలనీకి చెందిన తంగుడు శ్రీధర్‌ అనే వ్యక్తి కారుణ్య లక్కీ స్కీమ్‌ పేరుతో చిట్స్‌ఫండ్‌ నిర్వహిస్తున్నాడు. 2023 మార్చిలో దీన్ని పరిచయం చేయడంతో పలాస-కాశీబుగ్గకు చెందిన 200 మంది వరకూ వినియోగదారులు అందులో చేరారు. ఆయన చిట్స్‌, ఫైనాన్స్‌ చేస్తుండడంతో నమ్మకం కుదిరి రూ.80 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో మొత్తం ఖాతాదారులందరికీ నగదు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చిట్స్‌ వ్యాపారాన్ని బంద్‌ చేసి శ్రీధర్‌ పరారయ్యాడు. బాధితులంతా లబోదిబోమంటూ కాశీబుగ్గ పోలీసులకు ఆశ్రయించారు. జరిగిన మోసాన్ని సీఐ రామకృష్ణ వద్ద మొరపెట్టుకున్నారు. ఆయన ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించారు. ఈ బృందం శ్రీధర్‌ను బుధవారం పట్టుకొని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. అనధికార చిట్స్‌, ఫైనాన్స్‌ సంస్థల్లో ప్రజలు పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని సీఐ అన్నారు. ఎటువంటి వ్యాపారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jul 09 , 2026 | 12:23 AM